— మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి
Academy Chairman K Srinivas Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగాణ మీడియా అకాడమి సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా) పై ఒక్క రోజు శిక్షణా తరగతులు చాపెల్ రోడ్డు, నాంపల్లిలోని అకాడమీ భవనంలో శనివారం నాడు నిర్వహించింది.
మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, సోషల్ మీడియా సమాజంలో క్రియాశీలంగా అత్యంత ప్రాధాన్యత కల్గినదని అన్నారు. రాష్ట్రం లోని పలు జిల్లాల నుండి 60 మంది సోషల్ మీడియా జర్నలిస్ట్ లు తరగతులకు హాజరయ్యారు.
ఈ శిక్షణ తరగతులలో ప్రముఖ మీడియా నిపుణులు మాడభూషి శ్రీధర్, “సమాచార హక్కు చట్టం-2005” ఉపయోగాలను వివరించారు. సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్ కే. శ్రీనివాస్ “భాష – దోషాలు” అనే అంశంపై ప్రసంగించారు. ఉడుముల సుధాకర్ రెడ్డి డిజిటల్ మీడియాలో “వాస్తవాలు-ధృవీకరణ” అనే అంశం పై ప్రసంగిస్తూ డిజిటల్ టూల్స్ ఉపయోగాల పై అవగాహన కల్పించారు. సీనియర్ జర్నలిస్టు గోవింద రెడ్డి “నేర వార్తలు” అనే అంశంపై బోధించారు.
ముగింపు కార్యక్రమంలో గౌరవ అతిధిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సామాజిక పద్ధతులు, వ్యవసాయ, ఆర్థిక, భూములు, నదులు, అటవీ ఉత్పత్తులు మొదలగు అంశాలను విశ్లేశిస్తూ సమగ్రంగా వివరించారు. అకాడమి చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి జర్నలిజం – చట్టాలు – వృత్తి ప్రమాణాలు అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వేంకటేశ్వర రావు, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ కరుణాకర్ దేశాయ్, తదితరులు పాల్గొన్నారు.