–నాసిరకం ఆహార పదార్థాలే విద్యార్థులకు వడ్డింపు
–సంక్షేమ హాస్టళ్లలో దారుణ పరిస్థితులు
–పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్న వసతిగృహాలు
–అధ్వానంగా మరుగుదొడ్లు, బాత్ రూంలు.. వంటగదులదీ అదే పరిస్థితి
–రికార్డుల్లో అవకతవకలు.. విద్యార్థుల సంఖ్యలో వ్యత్యాసాలు
–మెనూకు మంగళం..
–మొక్కుబడిగా వచ్చిపోతున్న వార్డెన్లు
–తూనికలు కొలతల అధికారులు, శానిటరీ, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్ తో ఆపరేషన్
–ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి
ACB Inspection : ప్రజాదీవెన , నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లు దారుణమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వారికి మంచి అల్పాహారం కాని, భోజనం కాని అందడం లేదు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో వండిన ఆహార పదార్థాలనే వడ్డిస్తున్నారు. మెనూ పాటించడం లేదు. రోజూ ఇవ్వాల్సిన అరటిపండ్లు, గుడ్లు లాంటివి ఇవ్వడం లేదు. వసతి గృహాల్లో పారిశుధ్యం ఆనవాళ్లే లేవు. మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు వంటశాలల్లోనూ అపరిశుభ్ర వాతావరణం కొనసాగుతోంది. విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు. మొత్తం విద్యార్థుల సంఖ్యకు, హాజరు పట్టీలో నమోదు చేసిన సంఖ్యకు, మధ్య భారీ వ్యత్యాసం ఉంది. కొన్నిచోట్ల వార్డెన్లు అందుబాటులో లేరు. వారు ఇష్టారాజ్యంగా వచ్చి వెళుతున్నారు.
మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరికి వారు అందినంత దండుకునే వ్యవహారంగానే హాస్టళ్ల పనితీరు ఉన్నట్లు ఈ సోదాలో బయటపడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు, స్థానిక తూనికలు, కొలతల అధికారులు, శానిటరీ, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్ అధికారుల బృందంతో ఏసీబీ నల్లగొండ డిఎస్పి జగదీష్ చందర్ మంగళవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అత్యంత అధ్వాన పరిస్థితుల మధ్య విద్యార్థినిలు కాలం వెల్లదీస్తున్నట్టు గుర్తించాయి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు కొనసాగిన తనిఖీలో విస్తీపోయే నిజాలను ఏసీబీ నలగొండ డిఎస్పి జగదీష్ చందర్ మీడియాకు వెల్లడించారు.
మీడియాతో ఏసిబి డిఎస్పి…
వసతి గృహంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఏసీబీ నల్లగొండ డీఎస్పీ జగదీష్ చందర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంపై మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు చేసిన దాడుల తనిఖీల్లో విస్తు పోయే విషయాలను వెల్లడించారు. లీగల్ మెట్రాలజీ అధికారి చిట్టిబాబు, సానిటరీ అధికారి నాగరాజు, ఫుడ్ ఇన్స్ పెక్టర్ స్వాతి, ఆడిటర్ ప్రణయ్ ల తో కలిసి ఆకస్మిక తనఖీ నిర్వహించామని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో అవకతవకలు జరుగుతున్న విషయాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు.
ఇందులో భాగంగానే తమకు అందిన సమాచారం మేరకు తుంగతుర్తి వసతి గృహంపై దాడులు చేపట్టామని వెల్లడించారు. కొన్ని రికార్డులు సక్రమంగా లేకపోగా ఉన్న రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు.వసతి గృహంలో 51 మంది బాలికలు ఉన్నట్లగా రికార్డుల్లో నమోదైతే తమ తనిఖీల్లో మాత్రం 25 మంది విద్యార్థినిలు ఉన్నారని తెలిపారు.పక్కనే స్మశాన వాటిక ఉన్నందున విద్యార్థినిలు సాయంత్రం వేళల్లో వారి ఇండ్లలోకి వెళ్ళిపోతున్నారని తెలిపారు.వాస్తవానికి వసతి గృహ సంక్షేమ అధికారి మార్తమ్మ తో పాటు సిబ్బంది, విద్యార్థినులు అంతా వసతి గృహంలోనే ఉండాలని తెలిపారు.
కాగా వసతి గృహానికి వచ్చిన బడ్జెట్, ఖర్చులపై ఆడిటర్ ప్రణయ్, మరుగుదొడ్ల నిర్వహణ, పరిసరాల శుభ్రత పై సానిటరీ అధికారి నాగరాజు, సరుకుల స్టోరేజ్, వంట గదులు, తదితర వాటిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి తనిఖీలు చేసి రిపోర్టు ఇచ్చారని వివరించారు. బియ్యం, కూరగాయలు, పళ్ళు భద్రపరిచే గదిలో గాలి, వెలుతురు లేకపోవడం వల్ల సరుకులకు పురుగు పట్టిందని, పాయిజన్ గా మారే ప్రమాదం ఉందని తెలిపారు.విద్యార్థులకు బెడ్స్ సక్రమంగా లేవని అన్నారు. అడిగిన సమాచారం పై వసతి గృహ సంక్షమ అధికారి మార్తమ్మ సమాధానం ఇవ్వలేదని తెలిపారు.
కాగా వసతి గృహంలో నెలకొన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ అధికారులకు నివేదికల ద్వారా వివరిస్తామని అన్నారు. వసతి గృహ సంక్షేమ అధికారి మార్తమ్మపై చర్యలకు గాను నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి సంక్షేమ వసతి గృహాని ఏసీబీ అధికారులు ఇదే విధంగా తనిఖీలు చేస్తే వాస్తవాలు బయటికి వచ్చి విద్యార్థుల భవిష్యత్తు బాగుపడే అవకాశం ఉంది. మరి అధికారులు తనిఖీలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతారని ఆశిద్దాం.
సంక్షేమ శాఖ అధికారుల అలర్ట్…
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలంలో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో మంగళవారం ఏసీబీ అధికారులు తనఖీ చేస్తున్నట్లు వార్తలు మీడియాలో రావడం తో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని సంక్షేమ శాఖల హాస్టల్ వార్డెన్లు, అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానికంగా ఉండని వార్డెన్లు హాస్టళ్లకు పరుగులు తీసినట్లు సమాచారం. కొందరు హాస్టళ్లలో రికార్డులు సరిచేసుకునే పనిలో పడ్డారని తెలిసింది. అయితే ఏసీబీ దాడులు త్వరలో నల్లగొండ జిల్లాలోని సంక్షేమ హాస్టల్లో కూడా జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం లో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలిక వసతి గృహం పై కూడా ఏసీబీ అధికారులు గత ఏడాది ఆగస్టు 13వ తేదీన దాడులు నిర్వహించారు.
1064 కు ఫోన్ చేయండి…
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సిన పనులకు లంచాలు అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ 1064, ట్విట్టర్, ఎక్స్, ఫేస్ బుక్ ద్వారా నిర్భయంగా సమాచారం అందించాలని తెలిపారు.సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.