–ప్రతిరోజు వివరాలన్నింటినీ స్ప్రెడ్ షీట్లో పంపాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : భూ భారతి పై వచ్చిన దరఖాస్తులన్నింటిని 3 రకాలుగా విభజించుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులకు సూచించారు. సాదాబైనామాలు, తిరస్కరణకు గురైనవి, అంగీకరించిన దరఖాస్తులుగా మూడు భాగాలుగా విభజించుకోవాలని, ప్రతిరోజు ఈ వివరాలన్నింటినీ స్ప్రెడ్ షీట్లో పంపించాలని చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా, నార్కెట్పల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మీ సేవ ద్వారా తహసిల్దార్ కార్యాలయానికి నూతన రేషన్ కార్డుల కై వచ్చిన యూనిట్లు,కొత్త దరఖాస్తుల వివరాలను ఆర్ ఐ లాగిన్ తో పరిశీలించారు.అలాగే రేషన్ కార్డుల పై తహసీల్దార్ కార్యాలయంలో తీసుకొన్న చర్యలు పరిశీలించారు. భూ భారతి పై ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తహసిల్దార్, ఆర్ ఐ ల కు భూ భారతి దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ మీ-సేవ కేంద్రానికి వెళ్లి మీ- సేవ కేంద్రానికి ధ్రువపత్రాల కోసం వచ్చిన దరఖాస్తులు, రేషన్ కార్డులకై వచ్చిన దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిశీలించారు. అంతేకాక ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే ఫీజులు తీసుకోవాలని మీ-సేవ ఆపరేటర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థుల చదువు, సౌకర్యాలు, పరిశుభ్రత, తదితర అంశాలను పరిశీలించారు. కాగా ఇక్కడ నాలుగు తరగతి గదులకు మరమ్మతులు అవసరమని గుర్తించి వాటిని ఆధునీకరించాలని ఆదేశించారు. అలాగే బాలురు, బాలికలకు మరుగుదొడ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ రైతు మిత్ర ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అన్ని రకాల ఎరువులను ఆన్లైన్లోనే అమ్మాలని, ఆఫ్ లైన్ లో అమ్మవద్దని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోడౌన్ ను సైతం తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే ఎరువులు అమ్మాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్,డి ఈ ఓ భిక్షపతి, డిఎస్ఓ వెంకటేశం, మత్స్య శాఖ ఏడి చరిత, నార్కెట్ పల్లి తహసిల్దార్ వెంకటేశ్వరరావు, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.