–కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు
Principal Srinivasa Raju : ప్రజాదీవెన నల్గొండ :ప్రతి కళాశాల అభ్యున్నతికి కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆవశ్యకత, అవసరం ఎంతో ఉందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే. శ్రీనివాసరాజు అన్నారు. బుధవారంనల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె శ్రీనివాసరాజు మాట్లాడారు.ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షురాలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి. సుధారాణి మాట్లాడుతూ, తాము ఈ కళాశాలలో డిగ్రీ విద్యను అభ్యసించి, ప్రస్తుతం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నామని తెలిపారు.
తాము చదువుకున్న కళాశాల పట్ల ప్రతి ఒక్కరూ సంఘీభావంగా ఉండాలని, కళాశాల విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని నెరవేర్చే విధంగా పూర్వ విద్యార్థుల సంఘం కృషి చేస్తుందని తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థినుల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ సుల్తానా మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ఒక కళాశాల అభివృద్ధి చెందాలంటే కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తమ వంతు కృషిగా కళాశాల విద్యార్థులకు ఏదో ఒక విధంగా సహాయ పడాలని, తమ వంతుగా కళాశాల విద్యార్థినిలకు ఎకనామిక్స్ సబ్జెక్టులో స్పెషల్ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ తమ కళాశాల విద్యార్థుల కోసం ఆర్థికపరంగా కొంత సహాయం చేయమని పూర్వ విద్యార్థుల సంఘాన్ని కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సుంకరి రాజారామ్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మంజుల, ఐక్యూ ఏసి కోఆర్డినేటర్ కొమ్ము నరేష్, కళాశాల ఆలమ్ని అసోసియేషన్ కన్వీనర్ రామ్ రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ రవి, డాక్టర్ అరవింద, డాక్టర్ వసంత, డాక్టర్ జబీన్, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ సాలయ్య, డాక్టర్ సఫీయుల్లా, డాక్టర్ వీరన్న, డాక్టర్ మల్లికార్జున్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.