–కృత్రిమంగా మామిడిని మగ్గబెడుతున్న వ్యాపారులు
–కార్బైడ్ తో విషతుల్యం అవుతున్న ఫలాలు
–ప్రభుత్వ నిషేధాజ్ఞలు అమలుకాని వైనం
— పట్టించుకోని అధికారులు
— అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు
— నిబంధనలు అమలు చేయాలని డిమాండ్
Artificial Ripening of Mangoes: ప్రజాదీవన నల్గొండ బ్యూరో
మామిడి పండు చూడ.. మేలిమై ఉండు. రుచి చూడగా చప్పగా ఉండు…మంచి రంగుతో నిగనిగలాడుతున్న మామి డిని ఇష్టపడనివారెవరు? ఎంత ఖరీదైనా కొని తీసుకెళ్తున్నారు. తినేటప్పుడుగానీ దాని అసలు రంగు బయటపడటం లేదు. రసాలుగానీ, బంగినపల్లికానీ.. ఏ మాత్రం రుచీపచీ లేకుండా ఉంటున్నాయి. సహజ సిద్ధమైన రుచిని పూర్తిగా కోల్పోతున్నాయి. కారణం రసాయనాలతో మగ్గబెట్టడమే.నల్గొండ జిల్లావ్యాప్తంగా కార్బై డ్తో ముగ్గబెట్టిన పళ్లనే వ్యాపారులు విక్రయిస్తు న్నారు. ఈ పద్ధతిని ప్రభుత్వం ఏనాడో నిషేదించినా, అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అధికారుల తీరుపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
–ఇదీ సహజ పద్దతి…
చెట్ల నుంచి కాయలు కోశాక.. ఐదారు రోజులపాటు ఒక గదిలో ఎండుగడ్డి మధ్య ఉంచి, సాంబ్రాణి పొగ పెట్టి గది నుంచి గాలి బయటకు రాకుండా పేడతో అల్లుతారు. ఈ విధానంలో కాయలన్నీ పండుగా మారేందుకు దాదాపు వారం రోజుల సమయం పడుతుంది. పైగా అంత ప్రక్రియ చేయలేక వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు.
–ఇప్పుడిలా చేస్తున్నారు..
పక్వానికి రాని కాయలను కోసేసి కార్బైడ్ తో మగ్గ పెడుతున్నారు. దీన్ని వాడితే కాయలకు ఒకటి రెండు రోజుల్లోనే రంగు వస్తుంది. పైకి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. లోపల గుజ్జు దెబ్బతింటుంది. ఇవి తింటే వాంతులు, విరేచనాలు, ఊపిరితిత్తుల సమస్యల తోపాటు క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమై రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుందని అంటున్నారు. తప్పదనుకుంటే 12 గంటల సేపు నీటిలో నానబెట్టి తింటే మంచిదని పేర్కొంటున్నారు.
–కృత్రిమంగా మామిడిని మగ్గబెడుతున్న వ్యాపారులు..
–కాల్షియం కార్బైడ్ వాడకాన్ని మనదేశంతోపాటు ఇతర దేశాలు కూడా నిషేధించాయి.
–ఆహార కల్తీ నిరోధక చట్టంలోని సెక్షన్ 44ఏ ప్రకారం కార్బైడ్తో కృత్రిమంగా పండ్లను మగ్గబెట్టి అమ్మడం నేరం.
— నల్గొండ జిల్లాలోని పలు ప్రధాన ప్రాంతాలలో కొందరు వ్యాపారులు గదులను అద్దెకు తీసుకుని మామిడిని కార్బైడ్ తో మగ్గబెడుతున్నారు.
–అలాంటి పండ్ల చుట్టూ తెల్లటి పౌడర్ కనిపిస్తుంది.
–వాటిని గుర్తించి భూస్థాపితం చేసే అధికారం ఆహార భద్రత నియంత్రణశాఖ అధికారులకు ఉంది. కానీ.. వారు అసలు తనిఖీలే చేయడం లేదని జిల్లా ప్రజల ఆరోపిస్తున్నారు.
–ప్రభుత్వం ఏం చెప్పిందంటే…
ఆహార భద్రత నియంత్రణ శాఖ నిబంధనల ప్రకారం.. ఇథలీన్ పౌడర్ తో పండ్లను మగ్గబెట్టవచ్చు. ఈ పౌడర్ ఉన్న కవరుకు రంధ్రం చేసి పండ్ల మధ్యలో ఉంచి గదిలో గాలి బయటకు పోకుండా చూడాలి. పండ్లు మగ్గడానికి రెండు మూడ్రోజుల సమయం పడుతుంది. కానీ వాస్తవంగా అలా జరగడం లేదు.