Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ASP Avinash Kumar: అడ్డంగా బుక్కైన ఆలుమగలు

— దొంగతనం చేసి పారిపోతుండగా పట్టుబడ్డ వైనం

ప్రజాదీవెన, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శాస్త్రినగర్‌కు చెందిన పులి ప్రదీప్–వెంకటలక్ష్మీ ఇద్దరు దంపతులు.. జల్సాలకు అలవాటు పడిన ఆ ఇద్దరు దంపతులు.. ఈజీ మనీ కోసం పెద్ద స్కెచ్ వేశారు. తాళాలు వేసినా ఇళ్లు , దేవాలయాలే టార్గెట్‌గా చోరీలకు తెరలేపారు. పోలీసులకు ఎక్కడా చిక్కకుండా వరుస చోరీలకు పాల్పడుతూ లైఫ్‌ను జాలీగా గడుపుతున్నారు. ఎప్పటిలాగే ఓ ఆలయంలో చోరీకి యత్నించిన ఈ జంట దురదృష్టం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో అడ్డంగా దొరికిపోయారు. ఆలయంలోని హుండీని చోరీ చేసి కారులో పారిపోతుండగా.. సడన్‌గా కారు ప్రమాదానికి గురై అడ్డంగా పోలీసులకు చిక్కారు‌. పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించడంతో పాత కేసులన్ని కక్కేశారు. తమ చోరి కళను పోలీసులకు కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు.

బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన పులి ప్రదీప్‌కు రెండేళ్ల క్రితం కొడాలి వెంకటలక్ష్మీతో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనానికి‌ దారి తీసింది. అలా ఒక్కటైన ఈ జంట.. జల్సాలకు అలవాటు పడిన వీరు సంపాదించిన డబ్బులు సరిపోక దొంగతనాలను ఎంచుకున్నారు. ఈ నెల 22న అర్థరాత్రి కారులో నిర్మల్ జిల్లా కుభీర్ మండల పార్డి (బీ) శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో హుండీని పగులగొట్టి రూ. 10,910 నగదుతో పాటు ఇతర వస్తువులను చోరీ చేశారు. అక్కడి నుంచి చొండి శ్రీ దత్తసాయి ఆలయంలో చోరీ చేయగా.. ఏమి లేకపోవడంతో సిలెండర్‌ను ఎత్తుకెళ్లి మహారాష్ట్రకు వెళ్లిపోయారు. తిరిగి 23న వేకువ జామున భైంసాకు తిరిగి వస్తుండగా.. కుభీర్ శివారులో అనుమానస్పదంగా ఉన్న వీరిని అదుపులోకి తీసుకోని విచారించారు.

ఈ విచారణలో వీరు గత కొంత కాలంగా కుభీర్, భైంసా, ముథోల్, బాసర, నర్సాపూర్ (జీ)లలో రాత్రి పూట ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 10,910 నగదు, స్విఫ్ట్ కారు, రెండు సెల్ ఫోన్లు, గ్యాస్ సిలెండర్, కాళ్ల పట్టిలు, చోరీ చేయడానికి సంబంధించి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే వీరిద్దరిపై వివిధ పీఎస్‌లలో 8 కేసులు ఉన్నట్లు.. అరెస్ట్ అయి జైలు కూడా వెళ్లి వచ్చినట్టు తెలిపారు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా వీరి పద్దతి మారలేదని.. తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నారని ఏఎస్పీ తెలిపారు. ఈ వరుస చోరీల కేసు చేధించిన రూరల్ సీఐ నైలు, ఎస్సై రవీంధర్, సిబ్బందిని ఎస్పీ జానకీ షర్మిలా, ఏఎస్పీ అవినాష్ కుమార్‌లను ఆయన అభినందించారు. ఈ దొంగ జంటను రిమాండ్‌కు తరలించారు.