Awaaz 3rd state : ప్రజాదీవెన నల్గొండ : మైనారిటీల పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం వెనుకబాటుతనం వంటి సమస్యలపై పనిచేస్తున్న ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు గద్వాల జిల్లా కేంద్రంలో ఈ నెల 13,14 తేదీల్లో జరుగుతున్నాయని ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హశం తెలిపారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో ఆవాజ్ రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా హాశం మాట్లాడుతూ మైనారిటీల హక్కులతో పాటు లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా విశాల ప్రాతిపదికన పనిచేస్తున్న ఏకైక సంఘం ఆవాజ్ అని అన్నారు. దేశంలో మైనారిటీలు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిపోయారని అన్నారు. నిరుద్యోగం పేదరికం నిరక్షరాస్యతతో కొట్టు మిట్టాడుతున్నారని అన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా మతోన్మాద శక్తులు మైనారిటీలపై అబద్ధాలు అసత్యాలతో కూడిన వాదనలతో విషపూరితమైన విద్వేష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
370 ఆర్టికల్ రద్దు, సిఏఏ, వక్ఫ్ సవరణ చట్టం, త్రిబుల్ తలాక్, క్రిమినలైజేషన్ వంటి చట్టాలు మైనారిటీలను వేధించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని, గోరక్షణ పేరుతో మూక దాడులు చేసి 150 మందిని హత్య చేశారని అన్నారు. బుల్డోజర్ లతో మైనార్టీల ఇళ్ల కూల్చివేత యదేచ్చగా సాగుతుందని అన్నారు. ఈ మతోన్మాద విశ్వసంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తుందని ఆరోపించారు. మతోన్మాద శక్తులు సృష్టిస్తున్న అపోహలు, అపార్థాలను దూరం చేయడానికి మైనారిటీలపై జరుగుతున్న అసత్య, విద్వేష, విష ప్రచారాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం కలిగించాలని, లౌకికవాదాన్ని, మతసామరస్య విధానాలని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆవాజ్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో చారిత్రాత్మకమైన గద్వాల్ పట్టణంలో రాష్ట్ర మూడవ మహాసభలు జూలై 13,14 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 13వ తేదీ ఆదివారం రాజ్యాంగ హక్కులు లౌకికవాదం ఎదురవుతున్న సవాళ్లు అనే అంశంపై సెమినార్ జరుగుతుందని ముఖ్యఅతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు సుభాషిని అలీ హాజరవుతున్నారని తెలిపారు.
ఈ మహాసభలకు 33 జిల్లాల నుండి 500 మంది జిల్లా స్థాయి నాయకులు ప్రతినిధులు గా హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో కోశాధికారి ఎస్ కె. మహబూబ్ అలీ, పట్టణ కార్యదర్శి మహమ్మద్ ఇక్బాల్, సాజిద్, నాయకులు ఎం ఏ. రెహమాన్, హరీష్, సయ్యద్ నిజాం, ఎండి ఫయాజ్, ఎండి వహీద్, యూనిస్, సయ్యద్ యుసిఫ్, తదితరులు పాల్గొన్నారు.