–మట్టిలో నుంచి వెలుగు చూసిన మాణిక్యం
— సంఘర్షణ నుండి పుట్టిన జాతిరత్నం
— తరతరాలకు అతడే స్ఫూర్తి మంత్రం
–ఆయన సంకల్పల ముందు చిన్నబోయిన అడ్డుగోడలు
–జనం కోసం జీవించి జనంలోనే నిలిచిపోయాడు
–అందుకే జేజే లు.. అంబేద్కర్ సిద్ధాంతాలకు ప్రపంచమంతా నీరాజనాలు
–గతించి ఆరు దశాబ్దాలు అయిన సజీవంగా ఆ రూపం
కూర్చుంటే తప్పు.. నిలుచుంటే తప్పు.. మాట్లాడితే తప్పు.. చదివితే తప్పు.. అందులో వేదం చదివితే నాలుక తెగ్గోసేటంత తప్పు. అలాగని చదవకుండా ఉండి ఉంటే.. ఆ బుడతడు పుస్తకం పట్టకపోయి ఉంటే ఈ అడ్డుగోడలు కూల్చేదెవరు.? తనవారికి దారి చూపేదెవరు.? నాటి అసభ్య సమాజానికి సభ్యతను నేర్పేది ఎవరు.? ఈ సంఘర్షణలోంచి పుట్టుకొచ్చిన జాతిరత్నం అంబేద్కర్. మట్టిలోంచి వెలుగు చూసిన మాణిక్యం. ఎంతగా అంటే ఎదుగుదల ప్రస్థానాన్ని ఎవరు ఊహించలేనంతగా.. అందుకే నేటికే కాదు ఏ తరానికైనా అతడు స్ఫూర్తి మంత్రం.
జనం కోసం జీవిస్తే.. జనంలోనే నిలిచిపోతావు, స్వేచ్ఛ అనేది బహుమతిగా వచ్చేది కాదు.. అందుకోసం పోరాడి తీరాల్సిందే. దూలికణం స్థాయి నుంచి ప్రధాన నేతవరకు ఎదిగి, ఒదిగి చరిత్రలో నిలిచిపోయిన నవభారత శిల్ని విశిష్టత చెప్పడానికి ఇవి పరిచయ వాక్యాలు మాత్రమే. అంటరానివాడు అని చీదరించిన సమాజంతోనే అసాధ్యుడు అని అనిపించుకున్నాడు. దాడిత.. పీడిత ప్రజల జీవితాలలో వెలుగులు నింపాడు. అస్పృశ్యతను హతః పాతాళానికి తొక్ని కుల రక్కసిని కూకటి వేళ్లతో పెకిలించేందుకు తన జీవితాన్ని ధారపోశాడు.
ఏకంగా రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారు. అతనే భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్.బాబా సాహిబ్ గా ప్రసిద్ధి పొందారు. ఓ తత్వవేత్తగా.. చరిత్రకారుడుగా….. రచయితగా… పండితుడిగా.. సంపాదకుడిగా.. విప్లవకారుడుగా ఇలా ఎన్నో పాత్రలను ఏకకాలంలో పోషించారు అంటేడ్కర్. నేడు ప్రపంచమంతా నీరాజనాలు పడుతున్న బాబాసాహెబ్ సిద్ధాంతాల ప్రభావాల శీలత, సమకాలినత అనితరసాధ్యం. ఆయన 134వ జయంతి సందర్భంగా “ప్రజాదీవెన” ప్రత్యేక కథనం.
Baba saheb Ambedkar : ప్రజాదీవెన , నల్గొండ : గతించిన కాలంలో ఎందరో మహనీయులు.. వారిసేవల ఫలితమే నేటి స్వాతంత్ర్య భారతం. ఆ త్యాగధనుల స్మరణ ప్రతి భారతీయుని భాధ్యత. ఆనవభారత నిర్మాతల్లో మణిదీపం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి పట్టుకొమ్మలాంటి లిఖిత రాజ్యాంగంతో ప్రపంచ దేశాల సరసన భారత జాతిని నిలిపిన జాతి నిర్మాత. పీడిత, తాడిత అణగారిన వర్గాలకు పోరుబాటతో వెలుగు బాట వేసిన ఘనుడు. ఈనాటికి సువిశాల భారతాన్ని ఏకతాటిపై నిలుపుతోంది ఆయన రచించిన రాజ్యాంగ స్ఫూర్తి. నవ భారతానికి చుక్కానిగా నిలిచిన అంబేడ్కర్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవలసిన సమయం ఇది.
ధర్మశాస్త్ర పండితుడు. భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రి, బౌద్ధుడు, తత్వవేత్త, చరిత్రకారుడు, రచయిత, సంఘసంస్కర్త, సంపాదకుడు, విప్లవ జ్వాల. ఇలా ఎన్నో వైవిధ్య భావనలకు ఏకరూపంగా నిలిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఏమని చెప్పగలం.. ఆయన ఘనతను ఏమని వర్ణించగలం. ఆ మని దీపం వెలుగులకు అప్పుడే 134 సంవత్సరాలు.నేడు ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు యావత్ ప్రపంచమే సిద్ధమైంది. 1891 ఏప్రిల్ 14న రాంజీ బీమా భాయ్ దంపతులకు 14వ సంతానంగా ఈ లోకంలో అడుగు పెట్టారు అంబేడ్కర్.
అది మొదలు ఆ జీవితం సమాజానికి అంకితం అయింది. రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహా మేధావి అయినా విఖ్యాత భారతరత్నాని మనకు అందించింది. ఇవాళ ఇన్ని కోట్ల మంది గుండె చప్పుడుగా చేసింది. ఆధునిక భారత గతిలో అడుగడుగునా స్మరణకు వస్తూనే ఉంటారు. నిత్య నూతన ప్రవాహం లాంటి సిద్ధాంతాలు నేటికీ, ఏనాటికి దిశ నిర్దేశం చేస్తూనే ఉంటాయి. చేసిన ప్రతి పని, నడిపిన ప్రతి రాజకీయం, తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఆచంచలమైన జాతీయవాదమే ఆయన అభిమతం. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఈ రోజుకి ఏకదాటిపై నిలుపుతున్న స్ఫూర్తి మత్రం అదే. దేహం విడిచి ఆరు దశాబ్దాలు అయితేనేం ఆ రూపు అలా సజీవంగా కళ్ళముందు ఉండటానికి, బహుజనుల హృదయాలలో గుడి కట్టి మరి ఆరాధించడానికి కారణం అదే. ప్రపంచంలో అణచివేతకు గురవుతున్న ప్రజలందరికీ ఆయన దార్శనికునిగా నిలిచారు.
ఒకటా.. రెండా రాజ్యాంగం రాసినా, నీటిపారుదల, విద్యుత్ విధానాలు రూపొందించినా, “ది ప్రాబ్లం ఆఫ్ రూపీ.. ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్” అనే పుస్తకం ద్వారా ఆర్బిఐ ఏర్పాటు జరిగినా ఇలా ఏదైనా నవభారత నిర్మాణమే ధ్యేయంగా సాగారు. భరతమాత అసలు సంకెళ్లు తెంచడానికి విద్యనే సరైన సాధనమని విశ్వసించారు. కులాల అంతరాల పై అలుపెరగని పోరాటంతో మార్గదర్శకంగా నిలిచారు. జాతీయవాదం అంటే స్వతంత్ర సాధనకే పరిమితం కాదని, జాతి నిర్మాణం కుల, వర్ణ వ్యవస్థలతో మగ్గిపోయిన సమాజంలో సామాజిక సమానత్వం, సాంస్కృతిక సమైక్యతనే అంతిమ లక్ష్యం కావాలని వెలుగెత్తి చాటారు. ఆ క్రమంలో కటోర శ్రమ, నిరంతర పఠన వ్యాసాంగం, అచంచలమైన దీక్షలే బాబాసాహెబ్ ను ప్రపంచంలో ప్రధమ శ్రేణిలో నిలిపాయి.
అహర్నిశలు సామాజిక న్యాయం కోసమే పోరాడిన హక్కుల సేనాని. తన జీవితంలో ఒక్క నిమిషం వృధా చేసిన, విశ్రమించిన నేటి భారతం ఎలా ఉండేదో ఊహించడమే కష్టం. నాటి భారతం లో అంటరాని వర్గం, నిరుపేద సమాజం, అట్టడుగు స్థానానికి చెందిన ఓ వ్యక్తి, స్వాతంత్ర్య భారత నిర్మాతల్లో ఒకరిగా అట్టడుగు స్థానానికి చెందిన ఓ వ్యక్తి నిత్య సహస్వాదిగా, విమోచన ఉద్యమాలకు ప్రాణప్రదంగా ఎదగడం సాధ్యమయ్యేది కాదు. అందుకే నూతన ప్రపంచాన్ని నిర్మించాలని ఆరాటపడే వారందరికీ ఎప్పటికీ ఆయన ఓ నాయకుడు, స్పూర్తి ప్రదాత. స్వతంత్ర భారతంలో నిమ్న వర్గాల కోసం మరో పోరాటం నిర్మించారు. సమాజం విలువలు ఆగాధంలోకి జారుకోకుండా కాపుకాశారు.
అందుకే అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ కార్ల మార్క్స్ లా ప్రపంచానికి పునర్బాష్యం చెప్పిన తత్వవేత్త మాత్రమే కాదు.. దోపిడి రాజ్యాంగా మారిన సమాజ గతిని మార్చాలని పిలుపునిచ్చిన దార్షానికుడు అని. నేటి ప్రతి పోరాటానికి ఆయనే ఊపిరి. తన జీవితమే సంఘర్షణలతో సాధించిన విజయం. త్యాగాలతో, పోరాటాలతో, సంస్కరణల వాదంతో, సహాస నిర్ణయాలతో నిండిన ఆ ప్రస్థానం సాంతం భారతీయ విలువలకే అంకితం. ఎన్నేళ్లయినా ఈ యుగ కర్త సేవలను భవిష్యత్తు తరాలకు పదిలం చేయాల్సిందే. అందుకే తెలంగాణలో గత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో దేశంలోనే ఎత్తైన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఎల్లలు దాటిన కీర్తి….
ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి గుర్తింపు పొందింది. నిర్వహించే అతిపెద్ద జయంతి వేడుకలు అంబేద్కర్ వే. లండన్ మ్యూజియంలో కార్ల మార్క్స్ పక్కన ఉంచిన ఏకైక విగ్రహం అంబేద్కర్ దే. నేడు ఐక్యరాజ్యసమితిలో జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. గత 124వ జయంతి సందర్భంగా గూగుల్ డుడులును ప్రచురించింది. 2020లో మొదటి సారీ ఆన్లైన్లో జయంతి వేడుకలు నిర్వహించారు. నేడు బ్రిటిష్ కొలంబియాలో ప్రభుత్వం సమానత్వ దినోత్సవం గా పాటిస్తోంది. నేడు భారతదేశ వ్యాప్తంగా సెలవుదినంగా పరిగణించబడింది.