గ్రూప్ 1 అభ్యర్థులను కలిసేందుకు వెళుతుండగా అదుపులోకి
తీవ్ర అసహనం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు
Bandi Sanjay: ప్రజాదీవెన, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను అడ్డుకుని పీఎస్ (ps) కు తరలిస్తున్న పోలీసులపై బండి సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులను కలిసేందుకు బండి సంజయ్ (Bandi Sanjay) శనివారం ఉదయం అశోక్ నగర్ కు వెళ్లారు. మహిళలని చూడకుండా హాస్టళ్లలో చొరబడి కొట్టారని బండి సంజయ్ కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైటాయించి బండి సంజయ్ నిరసన తెలిపారు. కేంద్ర మంత్రిని అయి ఉండి, నిరుద్యోగుల సమస్య (Unemployment problem) కోసం నిరసనకు దిగానని చెప్పారు. ఈ క్రమంలో ‘చలో సెక్రటేరియట్’కు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
బండి సంజయ్(Bandi Sanjay) పిలుపుతో వేలాదిగా గ్రూప్స్ అభ్యర్థులు సెక్రటేరియట్ వైపు కదిలారు. శాంతియుతంగా వెళుతున్న బండి సంజయ్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దోమలగూడ వద్దకు రాగానే పోలీసులు బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్స్ అభ్యర్థులు, బండి సంజయ్(Bandi Sanjay) పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిని అయిన తాను గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) వివరించేందుకు వెళ్తున్నానని, తనకు దారి ఇవ్వాలని కోరారు. మహిళల్ని కొట్టే అధికారం మీకెవరిచ్చారు, ఇలా కేంద్ర మంత్రిని మీ ఇష్టరీతిన అడ్డుకునే హక్కు ఎవరిచ్చారంటూ పోలీసులపై సంజయ్ మండిపడ్డారు. పోలీసులు గో బ్యాక్ అంటూ గ్రూప్స్ అభ్యర్థులు నినాదాలు చేశారు.