Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CIBIL Eligibility Verification : బ్యాంకర్లు సిబిల్ అర్హతను పరిశీలించి తక్షణమే ఎంపీడీవోలకు అందజేయాలి

— 20 వ తేదీ నాటికి 60 శాతం పురోగతి సాధించాలి

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

–25 లోగా జాబితాను తయారు చేయాలని ఆదేశం

–బ్యాంకర్లు జాప్యం చేసినట్లయితే సమస్యలు ఫైనాన్స్ సెక్రటరీ దృష్టికి

 

CIBIL Eligibility Verification : ప్రజాదీవెన నల్గొండ :  రాజీవ్ యువ వికాసం పథకం అమలులో నల్గొండ జిల్లాను మంచి స్థానంలో ఉంచేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను బ్యాంకర్లు సిబిల్ అర్హతను పరిశీలించి తక్షణమే ఎంపీడీవోలకు అందజేయాలని ఆదేశించారు. సోమవారం ఆమె రాజీవ్ యువ వికాస పథకంపై కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా బ్యాంకు కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఎల్ డీఎం శ్రామిక్, డిఆర్డిఓ, ఇన్చార్జి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శేఖర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నసీరుద్దీన్, మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి ,వివిధ బ్యాంకు కో-ఆర్డినేటర్లు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని, ఇందుకుగాను ప్రతి దశలో ఒక సమయాన్ని నిర్దేశించి ఆ సమయంలోగా అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు పనిచేయాల్సిందని, ఇప్పటివరకు ఈ పథకం కింద వచ్చిన 73,464 దరఖాస్తులలో బ్యాంకులకు పంపించిన 73,200 దరఖాస్తులను సిబిల్ అర్హతను పరిశీలించి సంబంధిత ఎంపీడీవోలకు వెంటనే ఇవ్వాలని తెలిపారు.

బ్యాంకర్లు, బ్యాంక్ మేనేజర్లు అన్ని దరఖాస్తుల సిబిల్ అర్హతను పరిశీలించి ఎంపీడీవోలకు పంపించాలని, ఎంపీడీవోలు వారి స్థాయిలో అన్ని అర్హతలు పరిశీలించి ఈనెల 25 లోగా జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. కాగా ఇప్పటివరకు బ్యాంకర్లు 11వేల దరఖాస్తుల సిబిల్ అర్హతను పరిశీలించి తిరిగి ఎంపిడిఓలకు అందజేయడమే కాకుండా, 6500 దరఖాస్తులను అప్డేట్ చేసినట్లు జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి శ్రామిక్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. తక్కినవి వెంటనే పరిశీలించి ఎంపీడీవోలకు అందజేస్తామని తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల సిబిల్ అర్హత ప్రక్రియ మంగళవారం నాటికి 60 శాతం పురోగతి సాధించాలని కలెక్టర్ అన్నారు. దరఖాస్తుల సిబిల్ అర్హత పరిశీలనలో బ్యాంకర్లు జాప్యం చేసినట్లయితే సమస్యను ఫైనాన్స్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే లబ్ధిదారులకు సంబంధించి పథకం సబ్సిడీ, రుణాన్ని మంజూరు చేసేందుకు గాను వెంటనే ఏలాంటి లావాదేవీలు లేని బ్యాంకు ఖాతాను ప్రారంభించాలన్నారు.