–సిపిఎం డిమాండ్
–డిఇఓ బిక్షపతికి వినతి
government schools :ప్రజాదీవెన నల్గొండ :నల్లగొండ ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు టాయిలెట్స్, ప్రహరీ గోడలు, మంచినీటి సౌకర్యం, వంట గదుల నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు. సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఉన్న 14 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వే నిర్వహించడం జరిగింది. సర్వేలో వచ్చిన సమస్యలన్నింటినీ క్రూఢీకరించి ఏ సమస్య ఏ పాఠశాలలో ఉందో తెలియజేస్తూ వినతిపత్రం తయారు చేశామని చెప్పారు. జిల్లా కేంద్రం అయినా నల్లగొండ పట్టణంలో మూత్రశాల లేక జేబీఎస్, పద్మా నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బహిరంగ మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి ఉందని అన్నారు. మంచినీరు లేక క్యాన్ ల ద్వారా కొనుగోలు చేసుకుంటున్నారని అన్నారు. మర్రిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ లేక మద్యం ప్రియులు రాత్రిపూట పాఠశాలకు లోపలికి వచ్చి అపరిశుభ్రం చేస్తున్నారని, వెంటనే గేటు నిర్మాణం చేయించాలని కోరారు. మధ్యాహ్న భోజన వంట గదులు 14 పాఠశాలలకు గాను 6 పాఠశాలల్లో చెట్ల కింద వంటలు చేస్తున్నారని అన్నారు. మన ఊరు – మన బడి పథకం ద్వారా కేశరాజు పల్లి, దేవరకొండ రోడ్డు, మర్రిగూడ ఉన్నత పాఠశాలలో భోజనశాల కోసం నిర్మాణాలు చేసి బిల్లు రాక అసంపూర్తిగా ఆగిపోయాయని వాటికి వెంటనే బిల్లులు చెల్లించి ఉపయోగంలోకి తీసుకురావాలని, మిగతా పాఠశాలలకు కూడా భోజనశాలలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఏ పాఠశాలలో కూడా బోధనేతర సిబ్బంది జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు, నైట్ వాచ్మెన్ గాని ఎవరూ లేరని అన్ని పాఠశాలలకు తగిన సిబ్బందిని నియమించాలని కోరారు. హాస్టల్స్ అందుబాటులో ఉన్న డివికె రోడ్, డైట్ గొల్లగూడ, రాష్ట్రపతి రోడ్డు బాలికల పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అందుకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన ప్రధానోపాధ్యాయులు ఏడు పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి ప్రధానోపాధ్యాయులను, మండల విద్యాధికారులను నియమించాలని కోరారు. విద్యార్థుల సంఖ్య కనుగుణంగా అన్ని పాఠశాలలకు సబ్జెక్టుల వారిగా అందరూ ఉండే విధంగా అవసరమైన చోట డిప్యూటేషన్ ద్వారానైనా నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. సైన్స్ ల్యాబులు గ్రంధాలయాలు ఎక్కడ కనిపించే పరిస్థితి లేదని అన్నారు సైన్స్ పరికరాలు, పుస్తకాలు ఉన్న భద్రపరచుకోవడానికి సరైన గదులు లేవనిఅన్నారు. ఉన్న ప్రభుత్వం వెంటనే పాఠశాలలకు మౌలిక సదుపాయాలు విద్యా ప్రమాణాలు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కోట్ల అశోక్ రెడ్డి, అద్దంకి నరసింహ, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్ తదితరులు పాల్గొన్నారు.