–అదనపు కలెక్టర్ శ్రీనివాస్
Kharif Paddy Procurement : ప్రజాదీవెన నల్గొండ : రానున్న ఖరీఫ్ సీజన్ లో దాన్యం కొనుగోలుకు కావలసిన సామగ్రి కై ముందు నుండే సిద్ధం కావాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులకు సూచించారు. శుక్రవారం అయన తన చాంబర్లో ఖరీఫ్ – 2025 సీజన్ కు ఆయా వ్యవసాయ మార్కెట్ యార్డులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉండగా, ఇటీవల జిల్లా యంత్రాంగం రెండు వ్యవసాయ మార్కెట్ యార్డులకు మొబైల్ గ్రైన్ డ్రయ్యర్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి మొబైల్ గ్రైన్ డ్రయ్యర్లను అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ల లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది.
రబీలో 2000 మెట్రిక్ట్ టన్నులకు మించి ధాన్యం వచ్చిన 110 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆటోమేటిక్ ప్యాడి క్లీనర్ లను ఏర్పాటు చేసే విషయం, తూకం, తేమ కొలిచే యంత్రాలకు మరమ్మతు చేయించి సిద్ధంగా ఉంచుకోవడం, అలాగే ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మరిన్ని టార్పాలిన్లను ఇచ్చే విషయం సమావేశంలో చర్చించారు.
మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకురాలు ఛాయాదేవి, పౌరసరఫరాల జిల్లా అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిసీఓ పత్యా నాయక్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.