— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Bhu Bharati Act Telangana :ప్రజాదీవెన నల్గొండ :రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనమా, పిఓటి వంటి సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. భూములకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే రాష్ట్రప్రభుత్వం పైలెట్ మండలం నకిరేకల్ గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల లో దరఖాస్తులు ఇవ్వాలని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల భూ భారతి చట్టంపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులను నిర్వహించిన విషయం తెలిసిందే. భూముల సమస్యలపై గతంలో నిర్వహించిన 4 పైలెట్ మండలాలు మినహాయించి ప్రస్తుతం 28 జిల్లాలలో ఒక పైలెట్ మండలాన్ని ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 5 నుండి తిరిగి జిల్లాకు ఒక పైలట్ మండలంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి అక్కడి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నది.నల్గొండ జిల్లాకు సంబంధించి నకిరేకల్ మండలాన్ని పైలట్ మండలంగా తీసుకోగా, ఈ నెల 5 నుండి ఆ మండలంలోని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది. బుధవారం నకిరేకల్ మండలం చందనపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు ముందుగా మండల తహసిల్దార్ జమీర్ మాట్లాడుతూ గ్రామంలో అప్పటివరకు 46 దరఖాస్తులు వచ్చాయని చెప్పగా, ఎలాంటి కేసులు వచ్చాయని జిల్లా కలెక్టర్ అడిగారు. పిఓటి, సాదా బైనామ కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత అసైన్మెంట్ భూములకు ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని, అయితే అసైన్మెంట్ భూములను అమ్మడం కొనడం చేయకూడదని, 2017 కు ముందు ఏదైనా లావాదేవీలు జరిగినట్లయితే అలాంటి వాటికి దరఖాస్తులు సమర్పిస్తే పరిశీలించడం జరుగుతుందని, రైతు తప్పనిసరిగా మొఖా మీద ఉండి సరైన ఆధారాలు ఉండాలని తెలిపారు. 2017 తర్వాత ఏవైనా లావాదేవీలు జరిగినట్లు ఉంటే అలాంటి వాటిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయదని స్పష్టం చేశారు. సాదా బైనమాకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉండడంవల్ల అలాంటి వాటిని పరిష్కరించేందుకు సమయం పడుతుందని చెప్పారు. ఇలాంటి వాటికి కూడా భూభారతిలో పరిష్కరించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని, ఆర్డీవో కార్యాలయంలో వీటిని రెగ్యులరైజ్ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. గ్రామంలో 75 సర్వే నెంబర్లో ఆదనపు భూమి విషయాన్ని, గతంలో అసైన్మెంట్ ఇచ్చిన భూములు ఇతరుల పేర్లపై ఉన్న విషయాలను గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలను ఆధారాలతో సహా పరిశీలించిన తర్వాత సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సర్వేయర్ల కొరత కారణంగా భూములకు సంబంధించి సర్వే విషయంలో అనేక వివాదాలు ఉన్నాయని, ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేలను ఇస్తున్నందున సర్వే సమస్యలు తీరిపోతాయని కలెక్టర్ తెలిపారు. నకిరేకల్ మండలాన్ని పైలట్ కింద తీసుకొని భూ భారతిలో సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతున్నదని, అందువల్ల సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె రైతులతో కోరారు.
నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తదితరులు రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు.