–అక్కడే భోజనాలు చేసి నిరసన
–పోలీసులు నచ్చచెప్పడంతో ధర్నా విరమించిన బాధితురాలు
Big Breaking : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : కట్న కానుకలు దండిగా స్వీకరించిన ఓ భర్త.. పెళ్లయిన మూడు నెలలకే భార్యను వదిలించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సూటిగా కారణాలు చెప్పకుండా సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెట్టి తల్లిగారింటికి వెళ్ళగొట్టారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమై.. పలుమార్లు అల్లుడిని బ్రతిమలాడారు. తమ కూతురుని కాపురానికి తీసుకెళ్లాలని వేడుకున్నారు. అయినప్పటికీ అల్లుడు ససేమిరా వినకపోవడంతో ఆవేదన చెంది పెద్ద మనుషులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ అల్లుడులో మార్పు రాలేదు. కూతుర్ని కాపురానికి తీసుకెళ్లలేదు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు తీవ్రంగా దుఃఖిస్తుండగా ధైర్యం చేసిన అమ్మాయి తన భర్త కోసం, న్యాయం కోసం, సరాసరి తన భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బంధువులతో కలిసి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటుంది. వివరాల్లోకి వెళితే.. త్రిపురారం మండలంలోని బెజ్జికల్ గ్రామానికి చెందిన బాధిత వివాహితురాలు.. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ గల లకడాపురం సత్యనారాయణ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ నల్గొండ పట్టణానికి చెందిన లకడాపురం సత్యనారాయణ కుమారుడు మహేందర్ తో తనకు ఆరునెలల క్రితం వివాహం జరిగిందని తెలిపింది.
వివాహం జరిగిన రెండుమూడు నెలల నుండి తన అత్త సైదమ్మ,ఆడబిడ్డ శ్రీలత ల చెప్పుడు మాటలతో.. వివిధ కారణాలతో తన భర్త మహేందర్ తనను ఇబ్బందులకు గురిచేస్తూ కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆవేదనతో తెలిపింది. ఈ విషయంపై త్రిపురారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిపారు. అయితే ఇరుకుటుంబాల సభ్యుల వాదనలు విన్న పెద్దమనుషులు వివాహ సమయంలో తాము ఇచ్చిన బంగారు ఆభరణాలు, వరకట్నం తిరిగి ఇవ్వాలని తీర్మానించగా.. అవి ఇవ్వకుండా తనను కాపురానికి తీసుకెళ్లకుండా తన భర్త మహేందర్ తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిపింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తన జీవితంతో చెలగాటం ఆడుతున్న భర్త మహేందర్ అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.