— ఈనెల 20న బీజేఎల్పీ ఆధ్వర్యం లో రైతుదీక్షలు
— పంట రుణమాఫీ సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్
BJALP: ప్రజా దీవెన, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ (Runamafi) సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న బీజేపీ శాసనససభా పక్షం (BJALP) రైతు దీక్ష నిర్వహించనుంది. ఎకరాకు రూ.15వేల చొప్పున రైతు భరోసా (Raithu Barosa) ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడం లేదని బీజేఎల్పీ విమర్శించింది. గురువారం అసెంబ్లీలోని బీజేఎల్పీలో పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహే శ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు–వైఫల్యాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎంపీలు కె.లక్ష్మణ్, డీకేఅరుణ, ధర్మపురి అర్వింద్, ఈటల, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నగేశ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్, పైడి రాకేశ్‌రెడ్డి, రామారావు పాటిల్, వెంకటరమణారెడ్డి , సూర్యనారాయణగుప్తా, డాక్టర్ హరీష్‌బాబు,ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత, పార్టీ సభ్యత్వ నమోదు, అంశాలపై ప్రధానంగా చర్చించారు.
ఈనెల 17న తెలంగాణ (Telangana) విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ తీర్మానం ఆమోదించారు. భారీ వర్షాలు, వరదలతో జరిగిన పంట నష్టంపై ప్రభుత్వం వెంటనే కలెక్టర్‌ల నుంచి నివేదికలు తీసుకోవాలని డీకే అరుణ (DK Aruna) డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఎకరాకు రూ. 15వేల చొప్పున రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాథమిక కార్యాచరణ ప్రకారం, ఈనెల 20న రైతు దీక్ష నిర్వహిస్తామని, అయితే, పార్టీ నాయకత్వంతో చర్చించి దీక్ష తేదీని ఖరారు చేస్తామన్నారు. వరద బాధిత రైతులకు ఎంత ఖర్చు చేసిందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు విజ్ణప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే సెక్యులర్ పార్టీ అయితే, సెక్యులర్ హైడ్రా కొనసాగించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.