–అస్తవ్యస్త నిర్మాణాల అన్నింటిని వెంటనే నిలిపివేయాలి
–మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి
–సాధ్యమైనంత త్వరగా కుంభాభిషేఖం జరిపించాలి
–రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్
— గుట్ట పైన 44 ఎకరాలు, కింద 90 ఎకరాల స్థలం
— నిధులు 24 కోట్లు.. సంవత్సర ఆదాయం 14 నుండి 16 కోట్లు
— రెండు కిలోల 640 గ్రాముల బంగారు.. 241 కిలోల వెండి
–రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావు
Cheruvugattu Temple development :ప్రజాదీవెన నల్గొండ :నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలంలో ఉన్న చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ తెలిపారు.
సోమవారం ఆమె చెరువు గట్టు లో ఉన్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యకార్య నిర్వహణ అధికారి ఛాంబర్ లో దేవాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ముందుగా రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావు దేవాలయానికి సంబంధించి 44 ఎకరాల స్థలం గుట్టపైన ఉండగా, కింద 90 ఎకరాల స్థలం ఉందని,ప్రస్తుతం దేవాలయ నిధులు 24 కోట్లు ఉన్నాయని, సంవత్సర ఆదాయం 14 నుండి 16 కోట్లు వస్తున్నదని, రెండు కిలోల 640 గ్రాముల బంగారు ,241 కిలోల వెండి ఉన్నట్టు వివరించారు. దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను, ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్త నిర్మాణాలు, భవిష్యత్తులో దేవాలయ, భక్తుల అవసరాలు, తదితర వాటిపై వివరించారు. తర్వాత ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి మహత్యం, దర్శనానికి ఇతర జిల్లాల నుండి, ప్రత్యేకించి అమావాస్య రోజు లక్షల సంఖ్యలో వచ్చే ప్రజలు, ఆదాయం అన్ని తెలుసుకున్న తర్వాత రాబోయే 20, 30 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే విషయం పై సమీక్షించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.
ముఖ్యంగా ప్రస్తుతం చేపట్టిన అన్ని రకాల అస్తవ్యస్త నిర్మాణాల అన్నింటిని వెంటనే నిలిపివేయాలని, మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని, సాధ్యమైనంత త్వరగా కుంభాభిషేఖం జరిపించాలని, ఇందుకు స్థపతి తో పాటు, ఇంజనీరింగ్ అధికారులు దేవాలయ పరిసరాలన్నింటినీ పర్యటించి పనికొచ్చే నిర్మాణాలు కొనసాగించడం, పనికి రానివాటినన్నింటిని వెంటనే ఆపేయడం చేయాలన్నారు. భక్తుల వసతికి డార్మెటరీ నిర్మాణాన్ని చేపట్టాలని, గుట్టపైన ,కింద వాహనాలు ఆపేందుకు పార్కింగ్ అభివృద్ధి చేయాలని, ప్రణాళిక ప్రకారం స్థపతి సూచనలు,సలహాల మేరకు టాయిలెట్లు నిర్మించాలని, గిరిప్రదక్షిణకు ప్రణాళిక రూపొందించాలని, కళ్యాణ మండపం విస్తరించడానికి, అలాగే గుట్ట పైకి వెళ్ళడానికి, ముఖ్యంగా మూడు గుండ్ల వద్దకు వెళ్లేందుకు నడకదారి ప్రణాళిక రూపొందించాలని, శాస్త్రీయ పద్ధతిలో క్యూలైన్ల నిర్మాణం చేపట్టాలని, వాహన మండపం, గోశాల, ప్రస్తుతం ఉన్న నడకదారికి మరమ్మతు, సీసీ కెమెరాల పెంచడం, దేవాలయ భూమికి సంబంధించి భూ సేకరణ పూర్తి చేయడం, చెరువు, కోనేరు అభివృద్ధి కి అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించాలన్నారు.ఈ ఓ పోస్ట్ గ్రేడ్ పెంచడం, దేవాలయానికి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయాన్ని, ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదివరకు మంజూరు చేసిన 12 కోట్ల రూపాయల పనులను ఆమె సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని దేవాలయాలకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని నాలుగైదు పెద్ద దేవాలయాలకు మాసూర్ ప్లాన్లు సైతం రూపొందించినట్లు తెలిపారు. అదే విధంగా జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని, ఇకపై చేపట్టే అన్ని పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
–నకిరేకల్ ఎంమ్మెల్యే మాట్లాడుతూ …
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంపై ప్రజలు ఎంతో విశ్వాసంతో వస్తారని, ఇక్కడ సరైన వసతులు లేనందున ఇబ్బందులు పడుతున్నారని, పరిశుభ్రత లేదని, అస్తవ్యస్త నిర్మాణాలు ఉన్నాయని, అమావాస్య రోజు సుమారు 60000 మంది ఇక్కడ నిద్ర చేస్తారని, వారికి టాయిలెట్ సౌకర్యాలు, గుట్టపై నుండి కిందికి దిగేందుకు ప్రత్యేక రహదారి, గిరిప్రదక్షిణ, కళ్యాణ మండపం విస్తరణ, క్యూ లైన్ ల ఆధునికీకరణ, కోనేరు ,చెరువు అభివృద్ధికి,3 గుండ్ల వద్దకు వెళ్లేందుకు నూతన సాంకేతిక తో దారి ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని సరైన విధంగా వినియోగించుకునే ఏర్పాటు, వాహన మండపం, మెట్ల దారి విస్తరణ, కాటేజీల నిర్మాణం, తదితర వాటిపై సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ చెరువుగట్టుకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఒక శాస్త్రియ పద్ధతిలో ముందుకు వెళ్లడం జరుగుతుందని, ఇటీవల ప్రభుత్వం జిల్లాకు చెరువుగట్టు సమీపంలో హరిత హోటల్ మంజూరు చేసిందని, అయితే స్థలానికి సంబంధించి ఎస్ సి సంక్షేమ శాఖ నుండి క్లీరెన్సు రావాల్సి ఉందని, అలాగే పార్కింగ్ అతి ముఖ్యమని, కళ్యాణ సమయంలో ఒకరిపై ఒకరు పడి తోసుకోకుండా ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని, ఇందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
ధార్మిక పరిషత్ ప్రత్యేక సలహాదారు గోవింద హళ్లి మాట్లాడుతూ నల్గొండ వద్ద ఉన్న చెరువుగట్టు అతి పురాతమైన దేవాలయాలలో రెండవదని, ఒకటి చిత్తూరు జిల్లా గుడిమల్ల లో ఉందని, ఈ క్షేత్రం 108 వ పరశురామ క్షేత్రంగా నిలుస్తున్నదని,చెరువుగట్టు దేవాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాల్సి ఉందని, యాదగిరిగుట్టలో నరసింహ స్వామి, చెరువుగట్టులో పరమేశ్వర స్వామి గుర్తుకొచ్చేలా అభివృద్ధి చేపట్టాలని, వచ్చే పరుశురామ జయంతి నాటికి దేవాలయంలో ఏదైనా విశేషమైన కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
–మీడియా తో మాట్లాడుతూ….
అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి అభివృద్ధికి, పునర్వైభవం తీసుకువచ్చేందుకు చేపట్టనున్న చర్యలపై వివరించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేసినట్లుగానే చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండోమెంట్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు కళ్యాణ మండపం, కోనేరు, మెట్ల దారి, కాలభైరవ, ఆంజనేయస్వామి దేవాలయ దర్శనం పాటు, పరిసరాలను పరిశీలించారు. స్థపతి వళ్ళీనాయగం, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణమూర్తి, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డిఎస్పి శివరాం రెడ్డి, దేవాదాయ శాఖ ఎస్ ఈ ఓంప్రకాష్, ఈఈ శ్రీనివాస శర్మ, స్థానిక అధికారులు, తదితరులు ఈ సమీక్షయ సమావేశానికి హాజరయ్యారు.