–సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్
–బిసిలకు 42శాతం రిజర్వేషన్‌పై స్పష్టత కావాలి
–కులాంతర వివాహ చట్టం తేవాలి
–ప్రజా సమస్యలపై ఆందోళన కార్యచరణ సిద్ధం
Secretary John Wesley : ప్రజాదీవెన నల్గొండ : కేంద్రంలో మంత్రులతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో బనకచర్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారని కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రకటన చేసిన నేపథ్యంలో అసలు చర్చలు జరిగాయా లేదా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉందని వెంటనే ప్రజలకు స్పష్టతనివ్వాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో జరుగుతున్న ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సమావేశానికి విచేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనకు ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ గందరగోళాన్ని తొలగించే విధంగా నిపుణులతో చర్చించి అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
బనకచర్ల సమావేశం జరిగి ఉంటే ఆ సమావేంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి వరద, మిగులు జలాలపై స్పష్టమైన వాటాలను తేల్చాలన్నారు. అఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ధారణ జరగాల్సి ఉంది. కౌన్సిల్ సమావేశం జరగలేదు. కేంద్రలో ఉన్న బిజెపి రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందన్ని విమర్శించారు. బిసిలకు 42శాతం రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపారు. ఆ బిల్లును మూడు నెలలోపు తేల్చాలని సుప్రీం కోర్టు సైతం సూచించింది. అయినప్పటికీ రాష్ట్రపతి గాని, కేంద్రం గాని బిల్లును ఆమోదిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా స్పష్టతనివ్వలేదు. బిసిల రిజర్వేషన్‌పై కేంద్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉందని అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు బిసి రిజర్వేషన్‌పై ప్రధాన మంత్రిపై ఒత్తిడి తేవడం కాని రాష్ట్రానికి ప్రయోజకరంగా ఉన్నటువంటి అంశాలపై మాట్లాడరు, ప్రశ్నించరు, ఒత్తిడి తేరు ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాలని డిమడ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేస్తున్న వైకరిని సిపిఎం వ్యతిరేకిస్తుంది.
రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఎలాంటి అడ్డంకులు ఆర్డినెన్స్ తీసుకొచ్చి చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకోసం జెఏసి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగలు ఇస్తామని మేనిఫెస్టో ద్వారా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ప్రకటన చేసింది. అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది ఉద్యోగ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదని, ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రకటన చేసినంత వరకు ఉద్యోగాలు ఇచ్చారు. కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 200 మంది డివైఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడమంటే ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడం, నిర్భందించి ఉద్యమాన్ని ఆపడం సాధ్యంకాదన్నారు.
ఇప్పటికైనక ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో ఉద్యోగాల భర్తీ చేపటకపోతే నిరుద్యోగులు చేసే ప్రతి పోరాటానికి సిపిఎం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహ చట్టం తేవాలి. జగిత్యాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న మల్లేశ్ అనే యువకుడిని యువతి బధువులు హత్య చేశారు. ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. యువతీయువకులు మేజర్లు అయిన తర్వాత వారి ఇష్టానుసారంగా వివాహం చేసుకునే విధంగా కులాంతర వివాహ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కులం, పరువు పేరుతో రాష్ట్రంలో 42 హత్యలు జరిగాయి. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి దారుణమైన ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో జరిగిన హత్యకు కారకులైన వారిని శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని కుల, మతరహిత వివాహం చేసుకునే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
—ప్రజా సమస్యలపై ఆందోళన కార్యచరణ సిద్ధం…
ఆగస్టు, సెప్టెంబర్ నెలలో గ్రామాలు, బస్తీలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఆందోళన చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. గ్రామాలకు బస్తీలకు తరలివెళ్లాలని పిలుపునిచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా హామీలు ఇచ్చింది. అవి అమలుకు నోచుకోలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ప్రకటించి గ్రామానికి 5, 10 మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల స్థలాలు లేని బాధితులు 30 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలో ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాలను గుర్తించి 120 గజాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణం కోసం 5లక్షలు, ఎస్సీలకు 6లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంటి స్థలాలు ప్రభుత్వం కేటాయిస్తే దఫాలుగా నిర్మాణాలు చేపట్టవచ్చని సూచించారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో వ్యవసాయ కార్మికులకు 12 వేలు, మహిళలకు 2500 ఇస్తామని చెప్పింది కానీ ఇప్పటి వరకు జరగలేదన్నారు. కౌలు రౌతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. రాజీవ్ యువవికాస్ పేరుతో యువతకు 50వేల నుండి 5 లక్షల వరకు రుణాలు ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి 16లక్షలకు పైగా దరఖాస్తులు పెట్టించారు కనీసం 5లక్షల మందినైనా గుర్తించి ఇస్తామన్నారు. ఇప్పడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
అసలు ఎంతమందికి ఇస్తున్నారు? ఎంత సబ్సిడీ ఇస్తున్నారో? ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో..? స్పష్టత లేదని పేర్కొన్నారు. నిరుద్యోగ, స్థానిక సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మార్చి 10 నుండి 12 గంటల వరకు పనివిధానాన్ని అమలు చేసి శ్రమ దోపిడీకి పాల్పడుతుందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు జరగడం లేదు. కానీ పని గంటలు పెంచి శ్రమ దోచుకోవడినికి పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహిరిస్తున్నాయన్నారు. వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని 8గంటల పని విధానాన్ని అమలు చేయాలని పనికి తగ్గ వేతనం ఉండాలని డిమాండ్ చేశారు.
కార్మికుల కనీస వేతనం అమలు చేసేందుకు నెలకు 26 వేలు కుటుంబం గడవడం కోసం కావాలని కార్మికులు కోరుతున్నారు. వాటిని అమలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య, గ్రామ, పట్టణలోని ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు కోసం ఉద్యమించబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు చేస్తున్న పథకాలను ఎప్పటి వరకు పూర్తి చేస్తారనేది స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి అయిలయ్య, డబ్బికార్ మల్లేష్, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, ప్రభావతి, వి.వెంకటేశ్వర్లు, ఎండి.హాశం, చిన్నపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.