ప్రజా దీవెన, హైదరాబాద్: ఆరు దశాబ్దాల దళిత బహుజన ఆణి ముత్యం, పోరాటాల నిప్పు కణిక గడ్డం వెంకటస్వామి. ఆయన జీ వితం నేటి తరానికి ఎంతో ఆదర్శం. పేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టనష్టాలను చవిచూసి, ఆత్మగౌరపు శిఖరంగా నిలువెత్తు నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి వెంకటస్వామి. నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమం, గుడిసెల ఉద్యమం, కార్మిక, కర్షక పోరాటాల చరిత్రలో ఎవరూ చెరపలేని సంతకం కాకాది.
21 ఏండ్ల చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో జైలుకెళ్లిన వ్యక్తి ఆయన. తెలంగాణ సాయుధ పోరాటం సహా తొలి, మలి దశ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఒక్కరితోనే తెలంగాణ వచ్చిందని అనుకుంటున్న ఈరో జుల్లో, 6 దశాబ్దాల పాటు అలుపె రగని పోరాటం చేసిన నిప్పు కణిక గడ్డం వెంకటస్వామి. ఒక సంద ర్భంలో విద్యార్థులకు అండగా ముషీ రాబాద్ జైలు ముందు జరి గిన సమరంలో బుల్లెటుకు ఎదురు నిలిచి ప్రాణం పణంగా పెట్టి తెలం గాణ కోసం రక్తం చిందించిన నిజ మైన ఉద్యమకారుడు ఆయన.
1929 అక్టోబర్ 5న హైదరాబాద్ లో గడ్డం పెంటమ్మ, మల్లయ్యకు దళిత మాల కుటుంబంలో మూడో సంతానంగా పుట్టారు గడ్డం వెంకటస్వామి. ఆర్థికంగా ఇబ్బందులున్నా.. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనుకున్నారు కాకా తండ్రి మల్లయ్య. అందుకే ఆర్యసమాజ్ బడిలో ..,. తర్వాత మొగల్ పురా వస్తానియా స్కూల్లో చదివించారు. ఉర్దూ మీడియంలో మెట్రిక్ పూర్తి చేశారు. తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత వెంకటస్వామిపై పడింది. దీంతో కాకా చదువు మానేసి కొన్నాళ్లు భవన నిర్మాణ కూలీగా పనిచేశారు.
అదే టైంలో హైదరాబాద్ సంస్థానంలోని పరిస్థితులు ఆయన జీవితంపై ప్రభావితం చూపించాయి. ఆర్య సమాజ్ లో రామానంద తీర్థ పరిచయం, కాకా జీవితాన్ని మలుపు తప్పింది. ఆయన శిష్యుడిగా నిజాం వ్యతిరేక పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. 20 ఏండ్లు నిండకుండానే ఉద్యమం సాగించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో కాకా వెంకటస్వామి జైలుకెళ్ళారు. 1969 తెలంగాణ ఉద్యమంలో అరెస్టైన ఉద్యమకారుల కోసం ముషీరాబాద్ జైలుకు పోయి… అక్కడ పోలీస్ కాల్పుల్లో బుల్లెట్ దెబ్బలు తిన్నారు. మరణం అంచుల దాకా వెళ్లి వచ్చారు. ఇలాంటి పట్టుదలే తెలంగాణ ఉద్యమం ఆయన్ని తిరుగులేని నేతగా మార్చింది.
హైదరాబాద్ విలీనం తర్వాత… భవన నిర్మాణ కూలీగా, ఉద్యమకారుడిగా మొదలైన కాకా వెంకటస్వామి ప్రస్థానం… పేదలు, కార్మికుల నాయకుడిగా ఆ తరువాత ఎంపీగా, కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయికి చేరింది. మెట్రిక్ మాత్రమే చదివిన ఆయనకు జీవితం నేర్పిన అనుభవమే అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల తరపున ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లింది. స్వాతంత్ర్యోద్యమం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం దాకా అన్నింటిలోనూ పాల్గొన్న కాకా.. దేశంలోనే సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారు.
అప్పట్లో హైదరాబాద్ లో బతకడానికి వచ్చిన పేదలు ఖాళీ జాగాల్లో గుడిసెలు వేసుకునేవారు. భూముల విలువ పెరగడంతో భూస్వాములు పేదలను వెళ్లగొట్టడం మొదలుపెట్టారు. గూండాలతో దౌర్జన్యంగా వెళ్లగొడుతున్న తీరును చూసి కదిలిపోయిన వెంకటస్వామి…. 1949లో దేశంలోనే మొదటిసారిగా జాతీయ గుడిసెల సంఘం పెట్టారు. కాకా పోరాటంతో హైదరాబాద్ నగరంలోనే దాదాపు 80 వేల మందికి సొంత గూడు దక్కింది.
కాకా చేసిన బషీర్ బాగ్ గుడిసెల పోరాటం చరిత్రలో నిలిచింది. అక్కడ పేదలను గుడిసెలు ఖాళీ చేయించేందుకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఖాళీ చేయకపోవడంతో పోలీసులతో దాడి చేయించారు. దీనికి వ్యతిరేకంగా కాకా భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో లక్షల మంది పాల్గొనడం చూసి..అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి ఆశ్యర్యపోయారు. దీంతో పేదలు నివాసం ఉంటున్న జాగాలను వాళ్ళకే ఇప్పించారు. ఈ సంఘటనతో కాకాకు జనంలో ఉన్న బలం ప్రభుత్వానికి కూడా తెలిసొచ్చింది. భూస్వాముల చేతుల్లో చిక్కుకున్న భూముల్లో… కొంతైనా పేదలకు దక్కిందంటే కారణం 20 ఏండ్ల పాటు ఆయన సాగించిన ఉద్యమమే. అందుకే పేదలకు కాకా అయ్యారు. పేదల నాయకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
భవన నిర్మాణ కూలీలు, రిక్షా కార్మికుల సమస్యలపైనా కాకా పోరాటం చేశారు. తర్వాత కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై దృష్టి సారించారు. హైదరాబాద్ స్టేట్ INTUC ప్రెసిడెంట్ గా పోరాటాల్ని మరింత ఉధృతం చేశారు. ఒకే సమయంలో 101కి పైగా సంఘాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన నాయకత్వం వహించారు. 1961లో INTUC రాష్ట్ర అధ్యక్షుడయ్యాక… కార్మిక సంక్షేమం కోసం సహకార సొసైటీలను ఏర్పాటు చేయించారు. తర్వాత అన్ని సొసైటీలు కలిసి రాష్ట్ర సహకార సమాఖ్య ఏర్పాటైంది. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం పోరాడిన కాకా ఎట్టకేలకూ విజయం సాధించారు .
కార్మిక ఉద్యమాలతో ఎదిగిన కాకా… తర్వాత కాలంలో కేంద్రంలో కార్మిక మంత్రి బాధ్యతలు చేపట్టారు. నాయకుడిగా ఉన్నప్పుడు తాను ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లని మంత్రి అయ్యాక నెరవేర్చేందుకు చివరి దాకా పనిచేశారు. ఖాయిలా పడ్డ సింగరేణికి రూ.1100 కోట్ల కేంద్ర సాయం ఇప్పించారు. ఖాయిలా లిస్ట్ నుంచి తప్పించేలా చేశారు. దాదాపు లక్షా 20 వేల మంది కార్మికులు రోడ్డున పడకుండా కాపాడారు. అంతేకాదు.. బొగ్గు గని కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ, పెన్షన్ సౌకర్యం కల్పించిన ఘనత కాకా సొంతం.
ప్రైవేట్ రంగంలో పెన్షన్ సౌకర్యం కల్పించాలన్న ఆలోచన కాకాదే. రిటైర్ అయ్యాక ఒక్కసారిగా వచ్చే PF డబ్బు ఖర్చయిపోవడంతో.. రోడ్డున పడుతున్న కార్మికులను చూసి కాకా కదలిపోయారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లాగే.. ప్రైవేట్ కార్మికులకూ పెన్షన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. కాకా కృషితోనే పెన్షన్ ఫండ్ ఏర్పాటైంది. దీంతో కార్మికులు తాము దాచుకున్న సొమ్ము నుంచే పెన్షన్ అందుకోవడం మొదలైంది. ఇది కోట్ల మంది జీవితాలకు భద్రత కల్పించింది.
పెద్దపల్లి నియోజకవర్గంలో మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్దరణ కోసం కాకా జీవితాంతం కృషి చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు, కొడుకు వివేక్ వెంకటస్వామి ఎంపీ అయ్యాక కూడా అనేక ప్రయత్నాలు చేశారు. 10 వేల కోట్ల రూపాయల బాకీలు మాఫీ చేయించారు. దీంతో FCI పునరుద్దరణకు ఉన్న సమస్యలు తొలగిపోయాయి.
కాకా వెంకటస్వామి 1993లో టెక్స్‌టైల్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఈ రంగం తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంది. దీంతో చేనేత రంగాన్ని ఆదుకోవడం, ఖాయిలాపడిన మిల్లులను బతికించడంపై కాకా వెంకట స్వామి దృష్టి పెట్టారు. చేనేతకు సాయం ద్వారా కొన్ని లక్షల కుటుంబాలను నిలబెట్టవచ్చని గ్రహించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రగడ కోటయ్య తదితర చేనేత నాయకులతో చర్చించి కార్మికులకు సాయపడేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ రంగంలో జాతీయ స్థాయిలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. వర్క్‌షెడ్ కమ్ హౌజింగ్ స్కీమ్, హెల్త్ ఇన్సూరెన్స్, నేత కార్మికుల పిల్లల చదువులకు అవసరమయ్యే ప్రత్యేక స్కీమ్‌లు, థ్రిఫ్ట్ ఫండ్, ఇంటిగ్రేటెడ్ హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ స్కీమ్, మిల్‌గేట్ ప్రైస్ స్కీమ్, హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ సెంటర్, క్వాలిటీ డైయింగ్ స్కీమ్ తదితర పథకాలు కాకా వెంకటస్వామి హయాంలోనే రూపు దిద్దుకున్నాయి.
అంతకుముందు రాష్ట్రంలోనూ కార్మిక శాఖ పౌర సరఫరాల మంత్రిగా పనిచేసిన కాకా… ముక్కుసూటిగా పనిచేసే మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. పేదల కోసం అన్నపూర్ణ క్యాంటిన్లు పెట్టించారు. రాష్ట్రమంత్రిగా ఉండి.. జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులో దేశానికి ప్రతినిధిగా పాల్గొన్నారు. రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నా… జీవితాంతం కార్మికుల పక్షపాతిగానే పనిచేశారు .
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత 1957లో మొదటిసారి సిర్పూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కాకా. తర్వాత 1967లో సిద్ధిపేట నుంచి మొదటిసారిగా కాకా వెంకటస్వామి ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అలా రెండుసార్లు అసెంబ్లీకి.. ఏడుసార్లు లోక్ సభకు ఎన్నికైన కాకా… దేశంలోనే సీనియర్ నేతల్లో ఒకరిగా సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించారు. 2009 నాటికి కాకా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా తెలంగాణ చూసే దాకా ప్రాణం వదలనని ప్రతిజ్ఞ చేశారు. చివరకు స్వరాష్ట్రం రాష్ట్రం ఏర్పాటయ్యాకే 2015 డిసెంబర్ 22 కన్నుమూశారు. అంబేద్కర్ ఆలోచనలను జీవితాంతం పాటించిన కాకా… ఆయన పేరుతోనే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి… మంచి విద్యా ప్రమాణాలతో బడుగు వర్గాల పిల్లలకు చదువులు అందేలా చూశారు. అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విద్యా సంస్థల సేవలు ఇప్పటికీ చూసిన మార్గంలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కాకా కుటుంబం కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ… పేదల అభ్యున్నతికి కృషి చేస్తోంది.