*భారీ ఎత్తున హాజరైన అయ్యప్ప స్వాములు…
*పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన దేవస్థానం..
ప్రజా దీవెన,యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో బుధవారం అయ్యప్ప స్వాముల సామూహిక మహా గిరిప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ప్రారంభమైన ఈ అయ్యప్ప స్వాముల మహా గిరిప్రదక్షిణకు సుమారు పదివేలకు పైగా అయ్యప్ప స్వాములు, సాధారణ భక్తులు హాజరయ్యారు. పట్టణంలోని వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన ఈ గిరిప్రదక్షిణ అయ్యప్ప స్వామి భజనలతో లక్ష్మీ నరసింహ స్వామి వారి సంకీర్తనలతో కొనసాగింది. కళాకారులు భజన మండలి వారు కూడా స్వామివారి కీర్తనలు ఆలపిస్తూ అయ్యప్ప స్వామి పాటలు పాడుతూ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. దేవస్థానం ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేసింది. వైకుంఠ ద్వారం వద్ద కళాకారుల కోసం ప్రత్యేక వేదికను అదే విధంగా లైటింగ్ ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు, స్థానిక ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వాముల గిరిప్రదక్షిణ అంగరంగ వైభవంగా కొనసాగి తిరిగి స్వామివారి పాదాలు ఉన్న వైకుంఠ ద్వారం వద్దకు చేరుకుంది. అక్కడి నుండి అయ్యప్ప భక్తులు కొండపైకి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గిరిప్రదక్షిణ చేసిన అయ్యప్ప స్వాములకు స్వామివారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. గర్భాలయ దర్శనం చేసుకున్న అయ్యప్ప స్వాములు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ దేవస్థానం వారు చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు.. ఇందుకు దేవస్థానం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అయ్యప్ప స్వాములు మహాగిరి ప్రదక్షిణతో యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సుమారు గంట పాటు గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా కొనసాగింది.