–కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, వైద్య పరీక్షలు, తదితర జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకుగాను ఈ నెల 28న దేవరకొండ డివిజన్ కేంద్రంలో నిర్వహించనున్న అవగాహన సదస్సుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఈ విషయంపై మహిళా, శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా జిల్లాలో గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, గర్భిణీ సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం, మూఢనమ్మకాలు, అవగాహన లోపం వంటి కారణాలవల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అంతేకాక పుట్టబోయే పిల్లలు చనిపోయేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయని, వీటన్నిటిని నివారించేందుకుగాను వారిలో అవగాహన కల్పించే నిమిత్తం.
ఈ అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఇందుకుగాను ఆయా శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవానంతరం పిల్లలకు పాలు పట్టడం ,తదితర అన్ని అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడంపై సూచనలు, సలహాలు ఇవ్వాలని, ఇందుకుగాను వారికి పౌష్టికాహారం పై అవగాహన కిట్లు, తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డిఆర్డిఓ ఏపీడి శారద, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.