— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా నిఘాను, తనిఖీలను తీవ్రతరం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.ఇసుక అక్రమ రవాణాను అరికట్టే విషయ మై గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి తహ సిల్దార్లు ,ఎంపీడీవోలు, మైనింగ్ , ఇరిగేషన్ ,పోలీస్ అధికారులతో ఉదయాదిత్య భవన్లో సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం ద్వారా ఆయా ఇసుక రీచ్ లలో అనుమతించిన వాహనాలు, అనుమతించిన వారికి మాత్రమే ఇసుకను తీసుకువెళ్లే అధికారం ఉందని, అలా కాకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకు ఇసుక రీచ్ ల వద్ద నైట్ విజన్ కెమెరాలతో పాటు, హైరెజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన ఇసుక రీచుల వద్ద డ్రోన్ సర్వే సైతం చేయించడం జరుగుతుందన్నారు. పరిమితికి మించి ఇసుకను తవ్వినట్లయితే కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
కొత్తగా గుర్తించిన ఇసుక రీచ్ లను ఎంపీడీవోలు, తహసిల్దారులు సంయుక్తంగా సందర్శించి వారంలోగా పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలిపారు.
జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల నుండి కొన్ని ఇసుక రీచుల ద్వారా అనుమతితో, అలాగే అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా జరగకుండా ఎంపీడీవో, తహసిల్దార్ ,పోలీస్, మైనింగ్ అధికారులందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో 24 రీచ్ లలో ఇసుకను తీసేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని, వాటిని బలోపేతం చేస్తామని, ఇందుకు పోలీసు సహకారం కావాలని జిల్లా ఎస్పీతో కోరారు. ప్రతి కొత్త రీచ్ ను ఎంపీడీవో ప్రత్యక్షంగా పరిశీలించాలని చెప్పారు. నది లోతట్టు ప్రాంతంలో ఇసుక తవ్వడానికి వీలులేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.ఇసుక అక్రమ రవాణాను గట్టిగా అరికట్టాలని, ఇందుకు సంబంధం ఉన్న ప్రతి శాఖ అధికారి గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా 31 గ్రామాలలో ఇండ్లు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని ,అనుమతించిన ఇండ్లకు మాత్రమే ఇసుకను మంజూరు చేయాలని ,ఈ విషయంలో ఎంపీడీవోలు తహసిల్దార్లు పూర్తి కఠినంగా ఉండాలని, అలాగే గృహ నిర్మాణ శాఖ పీడీ సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. శాంక్షన్ మంజూరు పత్రం ఇస్తేనే ఇసుక ఇవ్వాలని పునరుద్గాటించారు.
ఇసుకకు సంబంధించి ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండవద్దని, అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇసుక పై పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలకు వెంటనే స్పందించాలని తెలిపారు.
అనుమతించిన ఇసుక రీచ్ ల వద్ద, ముఖ్యంగా లోడింగ్ పాయింట్ల వద్ద సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుకను తవ్వెందుకు అనుమతి ఉంటుందని, సాయంత్రం 5 దాటిన తర్వాత ఎవరైనా లోడింగ్ పాయింట్ల వద్ద ఇసుకను తవ్వినట్లయితే కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు గాను గడచిన నాలుగు నెలల క్రితమే జాయింట్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీములన్ని మరోసారి గుర్తించిన ఇసుక రీచులన్నింటిని సందర్శించాలని అన్నారు. ఎక్కడ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా అయ్యే అవకాశాన్ని కల్పించవద్దని ఆయన కోరారు. తహసిల్దారులు ఎక్కడైనా ఇసుకకు అనుమతులు ఇస్తే ఒక కాపీని పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇవ్వాలని కోరారు.దేవరకొండ ఏసీపీ మౌనిక మాట్లాడుతూ ఇసుకను అక్రమంగా తీసుకు వెళ్లే వారికి అలా తీసుకువె ళ్లకుండా కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఇప్పటివరకు ఇసుక అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టగలిగామని ,ఇకపై కూడా సంయుక్త బృందాలు సమన్వయంతో పని చేయాలని కోరారు. కొత్తగా గుర్తించిన ఇసుక రీచులను తక్షణమే సందర్శించి వివరాలు ఇవ్వాలని, రిజర్వాయర్ల నుండి ఇసుకను తీసుకు వెళ్లినప్పుడు అలాగే ఇసుక డంప్ చేసే ప్రాంతం వద్ద రిజిస్టర్లను నిర్వహిస్తే అక్రమ రవాణాను అరికట్టవచ్చు అని అన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా మైన్స్ శాఖ సహాయ సంచాలకులు జాకబ్, గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్ తదితరులు మాట్లాడారు.డిఎస్పీలు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, ఇరిగే షన్ శాఖ అధికారులు ఈ సమా వేశానికి హాజరయ్యారు.