–కలెక్టర్ ఇలా త్రిపాఠి
–తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ కు వెల్లడి
Collector Tripathi : ప్రజాదీవెన , నల్గొండ : పేద ప్రజలు, విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు బాలింతలు, కౌమార బాలికలకు పౌష్టికాహార పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా నల్గొండ జిల్లాలో ఆహార భద్రత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ కు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు శారద, భారతి, జ్యోతిలు మంగళవారం జిల్లాలోని కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాలలో జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అమలు తీరును వివిధ సంస్థలలో పరిశీలించిన అనంతరం సాయంత్రం జిల్లా కలెక్టర్ ను నల్గొండ లోని కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్, సభ్యులకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం జిల్లా కలెక్టర్ తో జరిగిన సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం పట్ల పేద ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, దీనివల్ల వారికి పూర్తిగా ఆహార భద్రత అందుతున్నదని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలకు సన్న బియ్యంతో భోజనం, పప్పు, బాలామృతం, గుడ్డు, పాలతో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని, అంతేకాక తృణధాన్యాలతో లడ్డూలను ప్రత్యేకంగా తయారు చేయించి గర్భిణీ స్త్రీలు, కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడకుండా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దీంతోపాటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యాన్ని వినియోగిస్తున్నామని, అంతేకాక రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో సైతం సన్నబియ్యంతో వారికి భోజనాన్ని అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన డైట్ చార్జీల ప్రకారమే భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పేద ప్రజలు, విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. నల్గొండ జిల్లా లో ముఖ్యంగా దేవరకొండ ప్రాంతంలో మాత శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల వాటిని తగ్గించేందుకుగాను ప్రత్యేక దృష్టిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకుగాను అక్కడి ప్రజలు మూఢనమ్మకాలను విడనాడి క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని తీసుకోవడం, పరీక్షలు చేయించుకోవడం, డాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం లేకుండా ఎప్పటికప్పుడు గర్భిణీ స్త్రీలను పరీక్షించి ఆరోగ్యంగా ఉండే పిల్లలు పుట్టేందుకు చర్యలు తీసుకోవడం, బిడ్డ పుట్టిన తర్వాత ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా తీసుకున్న చర్యల వల్ల శిశు మరణాల శాతాన్ని తగ్గించామని, మాతృమరణాలు లేకుండా చేశామని చెప్పారు.
దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో వంద పడకలు ఉన్నప్పటికీ , ప్రతి రోజు 180 మంది వరకు ఓపి ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని 200 పడకల స్థాయి పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించడం జరిగిందని వెల్లడించారు. అదేవిధంగా ఇటీవలే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు ఉద్దేశించి పోషణ పక్షోత్సవాలలో భాగంగా పౌష్టికాహారం పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల టీబి కేసులను తగ్గించడంలో పురోగతి ఉందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం పాఠశాల, వసతి గృహాల విద్యార్థులకు పెంచిన డైట్ చార్జీల ప్రకారం మెనూలోని అంశాలకు తగ్గట్టుగానే భోజనం పెడుతున్నామని, పెంచిన డైట్ చార్జీల వల్ల భోజనం నాణ్యత పెరిగిందని తెలిపారు.
ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేయాలి….
ఈ సందర్భంగా ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు శారద, భారతి, జ్యోతిలు మాట్లాడుతూ చౌక ధర దుకాణాలలో ఫిర్యాదులను తెలియజేసేందుకు ఫిర్యాదుల పెట్టను ఏర్పాటు చేయాలని, అలాగే నోడల్ అధికారుల నంబర్లను చౌక ధర దుకాణాలలో ఏర్పాటు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలలో పెద్ద సైజు పాల ప్యాకెట్లు ఇస్తున్నారని, దీనివల్ల ఒకరి కోసం పాల ప్యాకెట్లు ఓపెన్ చేయటం వల్ల వృధా అవుతున్నాయని, అలా కాకుండా చిన్న పాల ప్యాకెట్లు సరఫరా చేసే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని, ఆస్పత్రులలో సాధారణ ప్రసవాలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్,అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల ఇన్చార్జి అధికారి హరీష్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, మైనార్టీ సంక్షేమ అధికారి విష్ణు, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, తదితరులు ఉన్నారు.