– పేటలో జర్నలిస్టు సంఘాల రాస్తారోకో
Sakshi Media : ప్రజా దీవెన,సూర్యాపేట :విజయవాడలో సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడి అన్యాయమని జర్నలిస్టు సంఘాల నాయకులు మండిపడ్డారు. గురువారం స్థానిక వాణిజ్య భవన్ సెంటర్‌లో వివిధ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘాల నాయకులు ఐతగాని రాంబాబు, బంటు కృష్ణలు మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు పత్రికలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నాయని తెలిపారు.
అక్రమ అరెస్టులతో పత్రికలు, జర్నలిస్టులను అణచివేయొచ్చన్న అపోహలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయని తెలిపారు. ఎలాంటి నోటీసులు లేకుండా విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడులు చేయడాన్ని సూర్యాపేట జర్నలిస్టుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మీడియాను అణచివేయాలని చూస్తే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో పత్రికలపై దాడిచేసి ఏ పార్టీ, ప్రభుత్వం వల్ల కాదన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం రాజ్యాంగం కల్పించిన భావస్వేచ్చ ప్రకటనపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు సేవ చేయాలే తప్పా పత్రికలు, పత్రికల ఎడిటర్లపై దాడులు చేయడం అన్యాయమని చెప్పారు. అలాగే జర్నలిస్టు నాయకుడు కందుకూరి యాదగిరి సాక్షి ఎడిటర్ ఇంటిపై పోలీసుల దాడిని ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో సాక్షి ఆర్‌సీ ఇంచార్జి వర్ధెల్లి అరుణకృష్ణ, సాక్షి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ అనమాల యాకయ్య, వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులు విజయ్, ఊట్కూరి రవీందర్, బచ్చు పురుషోత్తం, ఫకీరు సైదిరెడ్డి, ఉయ్యాల నర్సయ్య, శ్రీనివాస్, బొడ్డు నాగరాజు, దుర్గం బాలు, అహ్మద్‌పాషా, చవగాని నాగరాజు, తండు సైదులు, గునగంటి అంజయ్య, తొండల నాగరాజు, రామచందర్‌రాజు, జలగం మధు తదితరులు పాల్గొన్నారు.