–ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మంపాటి శంకర్
–పెండింగ్ లో ఉన్న ఆరు నెలల మెస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
— సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
Tribal Students Neglect : ప్రజాదీవెన నల్గొండ : గిరిజన విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మంపాటి శంకర్ ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న ఆరు నెలల మెస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన హాస్టల్ విద్యార్థులకు, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు, గిరిజన కళాశాల హాస్టల్ విద్యార్థులకు గత డిసెంబర్ నుంచి ప్రస్తుత జూన్ వరకు మెస్, కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయకుండా గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం మంచిది కాదన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో, వసతి గృహాలలో వంద శాతం ఫలితాలు సాధించిన గిరిజన విద్యార్థుల పొట్ట కొట్టడం ముఖ్యమంత్రి కి న్యాయ మా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతుందని మండిపడ్డారు.
గిరిజన హాస్టల్ వసతి గృహ అధికారులు గత ఆరు నెలలుగా బహిరంగ మార్కెట్ లో వడ్డీలకు తీసుకొచ్చి, చివరికి వారి భార్య మెడలో ఉన్న పుస్తెలతాడు సైతం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వసతి గృహాలు నడిపి చివరికి రోడ్డు మీద పడే పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న గిరిజన హాస్టల్ విద్యార్థుల మెస్, కాస్మెటిక్ చార్జీలు విద్యార్థులు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు సొంత భావనాలు నిర్మించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన హాస్టల్ ల లో, గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించారని విద్యార్థులకు, హెచ్ డబ్ల్యువోలను, మంత్రి సీతక్క శాలువా కప్పి స్వీట్ తినిపించి వారికి ఇవ్వవలసిన మెస్ బకాయిలు ఇవ్వకుండా మరిచారని ప్రశ్నించారు. తక్షణమే గిరిజన ఆశ్రమ గిరిజన హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన సమరశీల విద్యార్థి ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు.
–పూర్తిగా విఫలం…
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బెస్ట్ అవలబుల్ స్కూల్ విద్యార్థులకు బకాయిలు విడుదల చేయడం లేదని, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు.విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వానికి బిఆర్ యస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కుర్ర సైదా నాయక్, డివిజన్ అధ్యక్షుడు మూడవత్ జగన్ నాయక్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.