–సిపిఎం డిమాండ్
CPM demand : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : నల్గొండ పట్టణంలోని 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించి లాటరీ ద్వారా ఎంపికైన వారికి ఇంటి పట్టాలు ఇచ్చి స్వాధీన పరచాలని సిపిఎం,జిల్లా కమిటి సభ్యులు యండి. సలీం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కమిటీ విస్తృత సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017 లో అప్పటి ప్రభుత్వం నల్గొండ పట్టణం ఇల్లు లేని పేదల కోసం 552 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం ప్రారంభించింది 2023 జూలైలో నల్గొండ పట్టణంలో ఇల్లు లేని పేదలందరూ దరఖాస్తు చేయగా విచారణ చేసి అర్హులను ఎంపిక చేసింది. వార్డుల వారీగా అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో వీడియో రికార్డ్ చేస్తూ అర్హులందరినీ లాటరీ పద్ధతిలో 552 లబ్ధిదారులను గుర్తించింది. కానీ వారికి ఇప్పటివరకు స్వాధీనపరచలేదని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక సదుపాయాలు అంతర్గత రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు కల్పించలేదని లబ్ధిదారుల తరఫున మేము అనేకమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించి పనులు పూర్తిచేసి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీన పరచాలని కోరామని గుర్తుచేశారు.
2017లో నిర్మాణం అయినందున శిథిలావస్థకు చేరుతున్నవి అర్హత కలిగి ఇండ్లు లేక పేదలు అవస్థలు పడుతున్నారు. రోజువారి పనులు చేసుకునే నిరుపేదలు అయిన వీరు ఇంటి అద్దెలు కట్టలేక కుటుంబాలు గడుపుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర మౌలిక సదుపాయాల కల్పించి లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీన పరచాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ కన్వీనర్ అవుట రవీందర్ మాట్లాడుతూ మాయమాటలు చెప్పి లబ్ధిదారులను మభ్యపెట్టడం సరికాదని వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, ఊటుకూరు మధుసూదన్ రెడ్డి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు గంజి రాజేష్, ప్రశాంతి, విశాలాక్షి, విజయలక్ష్మి, గంజి రాజేష్, ఇలియాస్, సుల్తాన్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.