–సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యండి సలీమ్
CPM : ప్రజాదీవెన , నల్గొండ టౌన్ : కాశ్మీర్ లోని పహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడాన్ని సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు ఎండీ. సలీమ్ తీవ్రంగా ఖండించారు. మృతులకి నివాళులర్పిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్లిన సందర్శకులని ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన హేయమైన చర్య అని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చర్యలను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మిల్ట్రీ దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చారని కథనాలు వెలువడుతున్నాయని, మొత్తం ఘటనపై సమగ్రమైన విచారణ చేయడం ద్వారా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని అన్నారు.
దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించడం ద్వారా కాశ్మీర్ లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. కాశ్మీర్ ప్రజలంతా ఉగ్రవాదుల దాడులకు నిరసనగా బంద్ ప్రకటించి, పాటించడం మంచి పరిణామమని అన్నారు. కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిని ఆసరాగా చేసుకొని దేశంలో మత విద్వేషాలను సృష్టించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉగ్రవాదుల చర్యలను ఖండించడంతోపాటు మృతుల కుటుంబాలకి అందరం అండగా నిలబడాలని సలీమ్ విజ్ఞప్తి చేశారు.