ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన సందర్భంగా, ప్రజాపాలన సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ నెల 9 నుండి జరగబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో సిపిఎస్ రద్దు ప్రకటన చేయాలని తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు ఆదివారం ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింప చేయాలని కోరారు. రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానం ద్వారా పెన్షన్ కు భద్రత భరోసా లేకుండా ఉన్నదని, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు అని తెలిపారు. భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలలో సిపిఎస్సి రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.