— నూతన సాంకేతికతతో అందుబాటులోకి యాప్
–అపాయాన్ని ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుంది
–ప్రాణ, ఆస్తి నష్టాలను నివారిస్తుంది
Damini App : ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ జిల్లాలోని ఓ మండలంలో గతం లో పిడుగు పడింది. దీంతో ఇంటి శ్లాబ్ బీటలు అవ్వడంతో పాటు ఇంట్లోని సామగ్రి ధ్వంసమయ్యింది. ఇంట్లోనీ కుటుంబ సభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ శబ్దానికి సమీపంలోని సుమారు ఆరు ఇళ్లలోని సామగ్రి పాడవడంతో పాటు వారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇలాంటి ప్రమాదాలను ముందస్తు గుర్తించి బయటపడడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి వాటి నుండి బయటపడవచ్చు.
—ముందుగానే గుర్తిస్తుంది..
వర్షాకాలం వచ్చిందంటే చాలు తరచూ ఏదో ఒక చోట పిడుగులు పడుతూ ఉంటాయి. వాటి తీవ్రతకు ప్రజలు, మూగ జీవాలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంటుంది. ఈ ప్రమాదాల నుంచి బయట పడటానికి, పిడుగుపాటును ముందుగానే గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్ అపాయాన్ని ముందుగానే గుర్తించి మనల్ని అప్రమత్తం చేస్తుంది.
—యాప్ అందుబాటులోకి..
వాతావర ణానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ప్రజలకు ఉపయోగపడేలా ‘దామిని’ (దామిని లైట్నింగ్ అలర్ట్ ) యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని పేరు, మొబైల్ నంబరుతో రిజిస్టర్ చేసుకోవాలి. జీపీఎస్ లొకేషన్ తెలుసుకోవడం కోసం యాప్ కు అనుమతివ్వాలి. దీంతో మీరు ఉన్న ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో లేదో ముందుగానే తెలుసుకో వచ్చు. ఈ యాప్ లో అన్ని భాషలు అందుబాటులో ఉన్నాయి.
–జాగ్రత్తలు తీసుకోవాలి…
పిడుగు పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాప్ లో తెలియజేస్తున్నారు. ఆరు బయట ఉంటే ఇళ్లలోకి వెళ్లాలి. వర్షం కురుస్తున్నప్పుడు చాలామంది చెట్ల కిందకు వెళ్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. చెట్లు పిడుగును త్వరగా ఆకర్షిస్తాయి. నిటారు చెట్టు కిందకి ఎట్టి పరిస్థి
తుల్లోనూ వెళ్లకూడదు. మెరుపులు అధికంగా ఉంటే ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగించకపోవడం మేలని నిపుణులు పేర్కొంటున్నారు.