Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dandari festival: గుస్సాడీ మోతలతో దండారీ

నృత్యాలతో మురిసిపోతున్న అడవితల్లి
భక్తిశ్రద్ధలతో ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్‌ పేన్‌’
ఆదివాసీల గజ్జెల మోతలతో దద్దరిల్లుతున్న సందడి

Dandari festival: ప్రజాదీవెన, ఆదిలాబాద్: ఆదివాసీ గూడాల్లో అంగరంగ వైభవంగా దండిగా సాగే దండారి పండుగ (Dandari festival) సంబరం మొదలైంది. డప్పుల దరువులు, గజ్జెల మోతలు , గుస్సాడీ నృత్యాలతో‌ (drums beating, gajjela motas and gussadi dances)అడవి తల్లి మురిసి పోనుంది. దండారి అంటేనే ఆదివాసీ గూడేల్లో సంబరాల వేడుక. యేటా ఆదివాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్‌ పేన్‌’ పేరిట చేసే ప్రత్యేక పండుగతో దండారి పండుగ (Dandari festival)ప్రారంభమవుతుంది. దీపావళికి ముందు భోగి పండుగతో ప్రారంభమై.. కొలబొడితో పండుగ ముగిస్తుంది. పక్షం రోజుల పాటు సాగే ఈ వేడుక తరతరాల సంప్రదాయాన్ని కొనసాగించే అద్బుత పండుగగా నిలుస్తోంది.

ఎక్కడ చూసినా తుడుం మోతలే..

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా తుడుం మోతలు, డప్పుల చప్పుల్లు , గుస్సాడీ నృత్యాల (drums beating, gajjela motas and gussadi dances) ఆటపాటలే కనువిందు చేస్తాయి. తరతరాల సంప్రదాయాన్ని తూచ తప్పకుండా పాటించే సంస్కృతి సంప్రదాయాల పుట్టినిళ్లుగా నిలుస్తూ ఆదివాసీ గూడాలు రారమ్మంటూ స్వాగతం పలుకుతాయి. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీల నృత్యాలతో గూడేలన్నీ మారుమోగుతాయి. ఓ వైపు కోలాటాలు, మరోవైపు గోండిపాటల నృత్యాలు, హాస్యనాటికల ప్రదర్శనలు అబ్బురపరుస్తాయి. ఆశ్వీయుజ పౌర్ణమి (full moon) అనంతరం ప్రారంభమయ్యే ఈ వేడుకలు పక్షం రోజుల పాటు అంగరంగవైభవంగా సాగుతాయి. తెలంగాణ ప్రభుత్వం దండారిని ప్రత్యేక పండుగగా కూడా గుర్తించింది. దండారి పండుగ వేళ చేసే గుస్సాడీ నృత్యాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొందాయి. ఈ పండుగలో ఆదివాసీల కట్టుబొట్టు ఎంత అద్బుతంగా ఉంటుందో.. పండుగ వేళ చేపట్టే దీక్ష అంత అత్యంత కఠినంగా ఉంటుంది.

గుస్సాడీలదే కీలక పాత్ర..
దండారి వేడుకల్లో (Dandari celebrations)గుస్సాడీలదే కీలక పాత్ర. వారి వేశాదరణ ఆకట్టుకుంటుంది. నెత్తిపై నెమలి పించం.. ఆ పించానికి ఇరు వైపులా దుప్పి కొమ్ములు.. పించం మద్యలో తలుక్కున మెరిసి అద్దం.. భుజానికి జింక తోలు, నడుము, కాళ్లకు గళ్లుగళ్లున మోగే గజ్జెలు, మెడలో శివయ్య రుద్రాక్షమాల.. ఒంటి నిండా బూడిద.. ముఖానికి నల్లని రంగు.. ఇలా విచిత్ర వేసాదారణతో కనిపించి వీరిని గురు అని.. ఆదివాసీ దేవుని ప్రతిరూపమని పిలుస్తారు.

పది రోజుల దీక్షలు..
ఆశ్వీయుజ పౌర్ణమి (Auspicious full moon) మరుసటి రోజు.. భోగి పండుగతో మాలధారణ వేసి.. పది రోజుల పాటు కఠిన దీక్షను తీసుకుంటారు గుస్సాడీలు. దీక్ష పూర్తయ్యే వరకు స్నానాలు ఆచారించకుండా , ఒంటిపై నీటి చుక్క కూడా పడకుండా.. కాళ్లకు చెప్పులు దరించకుండా.. చలిలో ఒంటిపై ఎలాంటి వస్త్రాన్ని కప్పుకోకుండా అర్ధ నగ్నంతోనే గడుపుతారు. నేల పైనే కూర్చోవడం, నేలపైనే నిద్రించడం గుస్సాడీల ఆచారం. గుస్సాడీల్లో పోరీలది మరింత ప్రాముఖ్యత. ఆడ వేషధారణలో ఉండే యువకులను ఆదివాసీలు పోరీలని పిలుస్తారు. ఏ ఊరికి వెళ్లినా.. ఏ ఇంటిని సందర్శించిన ఈ పోరీలు మంగళహారతులతో అష్ట, ఐశ్వర్యాలు కలగాలని , కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులు కలగాలనీ దీవిస్తారు.

ఐక్యమత్యానికి నిదర్శనం దండారీ..
దండారీ పండుగ అంటేనే ఐక్యమత్యానికి నిదర్శనం. ఈ పండుగ వేళ ఆదివాసీ గ్రామాల గిరిజనం ఒక ఊరు నుండి మరో ఊరికి విడిదికి వెళ్లడం ఆనవాయితీ‌. మారు మూల గిరిజన గ్రామాల (Tribal villages)గిరిజనం దండారి పండుగ వేళ ఓ గ్రామం నుండి దండారి బృందంతో మరో గ్రామానికి బయలు దేరి వెళుతారు‌. అలా చేయడం ద్వారా రెండు గ్రామాల మద్య సత్సంబంధాలు , భాందవ్యాలు పెరుగుతాయని చెప్తారు ఆదివాసీ పటేళ్లు‌. ఇలా విడిదికి వెళ్లే దండారీ బృందం కాలినడకనే ఎంచుకుంటారు.. అందులోను రాత్రి పూట మాత్రమే వెళ్లడం వారి ఆచారం. రాత్రంత నృత్యాలు చేస్తూ, రేలారేలా ఆటపాటలతో.. గోండి హాస్యపు నాటికలు ప్రదర్శించి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తారు ఈ గుస్సాడీలు. తెల్లవారగానే కాలకృత్యాలు తీర్చుకుని మాన్‌కోలాతో నృత్య ప్రదర్శనలు చేసి సాయంత్రం సార్‌కోలాతో ముగిస్తారు. ఈ సందర్భంగా వచ్చిన అథితులకు ఘన స్వాగతం పలికి.. ప్రత్యేక విందును ఏర్పాటు చేసి అతిధులకు వీడ్కోలు పలుకుతారు ఆదివాసీలు. అలా తమ గూడానికి వచ్చిన గుస్సాడీలతో ఆత్మీయ బంధం ఏర్పడి.. రెండు గూడాల మద్య స్నేహబందం మరింత బలపడి.. తరతరాలుగా కొనసాగిస్తున్న సంస్కృతీ సంప్రదాయల పరిరక్షణకు తోడ్పడుతుందనేది వారి భావన.

పద్మల్‌పురి కాకో ఆలయం వేదికగా..
దండారి పండుగ వేళ ఆదివాసీలు కొలిచే ఆరాధ్య దేవత పద్మల్‌పురికాకో (Worship Goddess Padmalpurikako). ఈ పండుగలో ఏత్మాసార్‌ పేన్‌ పేరిట నాల్గు సగ(గోత్రం)లలో ఉత్సవాలు జరుపుకుంటారు గిరిజనులు. నాల్గు సగలవారు అంటే గుమ్మేల, 5 సగల వారు అంటే ఫర్ర, 6 సగల వారు అంటే కోడల్‌, 7 సగల వారు అంటే తపల్‌ పేరిట ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ దండారి వేడుకల్లో భేటికోలా, మాన్‌కోలా, సదర్‌కోలా, కోడల్‌కోలా, సార్‌కోలా, కలివల్‌కోలా అనే నృత్యాలు చేయడం ఆదివాసీలకే సొంతం. పేర్లు ఎంత వైవిధ్యం గా ఉన్నాయో వారి ఆటపాటలు కూడా అంతే వైవిద్యం గా సాగుతాయి. చచోయ్‌ ఇట్‌ కోలారా.. దేనే దేనారా.. రేలా.. రేలా.. లాంటి ఆట పాటల నడుమ పద్మల్‌పురి కాకో ఆలయం వేదికగా దండారి ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతాయి.