DEO Satyanarayana : ప్రజా దీవన, నారాయణ పురం: సంస్థాన్ నారాయణపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం పొట్లాలు అందజేస్తున్న డీఈవో సత్యనారాయణ రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవి.మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు,గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కే. సత్యనారాయణ అన్నారు.ఈ నేపథ్యంలో డీఈవో సంస్థాన్ నారాయణపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదవ తరగతి విద్యార్థులకు రూ.1.50 లక్షల విలువైన అల్పాహారం, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందించిన హైదరాబాదుకు చెందిన రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవిని అభినందించి సన్మానించారు. సంస్థాన్ నారాయణపురం లోని జెడ్పి ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా జడ్పి, మోడల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ, అన్నింటికీ మూలం చదువేనని, పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థానానికి ఎదగాలని ఉద్బోధించారు. ట్రస్ట్ సమకూర్చిన 50 రోజుల అల్పాహారం సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. సాహితీవేత్త బడుగు శ్రీరాములు మాట్లాడుతూ, గ్రామాలు, విద్యార్థులు అభివృద్ధి చెందేందుకు గురువులు కృషి చేయాలని కోరారు. ఉత్తమ ఫలితాలు సాధించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు.
తాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవోదయ విద్యాలయంలో చదువుకున్నానని, తాను సంపాదించిన దాంట్లో కొంత అనాధలకు పేదలకు విద్యాభివృద్ధికి అందజేస్తున్నానని రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవి తెలిపారు. పేదరికాన్ని రూపుమాపేది, విద్యార్థుల తలరాతను మార్చేది, బాలల భవిష్యత్తును తీర్చిదిద్దేది చదివేనని వివరించారు. చదువు విలువ తెలుసుకోవాలని, ఎప్పుడూ ఉన్నత స్థానం కోసం పోటీపడాలని సూచించారు. తాను తన మిత్రులు ఏర్పాటు చేసిన ఈ ట్రస్టు ద్వారా అనాధలకు నిరుపేదలకు విద్యార్థులకు పాఠశాలకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సేవ చేయాలని కోరారు. కార్యక్రమానికి మండల విద్యాధికారి గోలి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సామాజిక కార్యకర్త సుక్కా సుదర్శన్, జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమాదేవి (సంస్థాన్ నారాయణపురం బాలురు), ఉషారాణి సమస్తాన్ నారాయణపురం బాలికలు), హనుమంతు (పుట్టపాక), కే ఉదయ (జనగాం), నర్రా నరసింహారెడ్డి (గుజ్జ), మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దీపా జోషి తదితరులు పాల్గొన్నారు.