Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputation : నువ్విక్కడ నేనక్కడ

— డిపిఓ కార్యాలయంలో విచ్చలవిడిగా అక్రమ డిప్యూటేషన్లు

— ఓకే రోజు 29 మంది పంచాయతీ కార్యదర్శులకు డిప్యూటేషన్ల ఉత్తర్వులు

–దరఖాస్తు చేసుకోకున్నా డిప్యూటేషన్ల పర్వం

— ఒకే చోట ఐదు సంవత్సరాలు పనిచేసిన ఓ కార్యదర్శికి తిరిగి పాత చోటే డిప్యూటేషన్

Deputation : ప్రజాదీవెన , నల్గొండ : నల్లగొండ డిపిఓ కార్యాలయంలో అక్రమ డిప్యూటేషన్ల దందా నిరాటకంగా కొనసాగుతోంది. జిల్లాలో 29 మంది పంచాయతీ కార్యదర్శులకు డిప్యూటేషన్లు వేస్తూ డిపిఓ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రొసీడింగ్ నెంబర్ 922/2025 ద్వారా డిపిఓ డిప్యూటేషన్ల జాతరకు తెర తీశారు. ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విధులకు గైర్హాజరైన 100కు పైగా పంచాయతీ కార్యదర్శులకు పనిష్మెంట్ కింద వారు పనిచేసిన ప్రాంతాలలో కాకుండా వేరే ప్రాంతాలలో పోస్టింగులు ఇస్తూ జనవరి 11న కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శులకు సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ ఫిబ్రవరి 24వ తేదీన పంచాయతీ కార్యదర్శులకు అధికారులు సంజాయిషీ నోటీసును జారీ చేశారు.

అధికారులు ఇచ్చిన సంజాయిషీ నోటీసు లకు ఎంతమంది పంచాయతీ కార్యదర్శులు సమాధానం ఇచ్చారు అన్నది అధికారులు నేటికీ స్పష్టం చేయకపోవడం విశేషం. కార్యదర్శులలో కొంతమంది తమకు లబ్ది చేకూరేందుకు మ్యూచువల్ బదిలీల పేరు తో కలెక్టర్ ను బురిడీ కొట్టించారు. ఆరోగ్య సమస్యలు, ఇతర కుటుంబ సమస్యలు ఉన్న ఒకరికో ఇద్దరికో చట్టంలో ఉన్న అధికారాన్ని వినియోగించుకుని డిప్యూటేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నా కేవలం అక్రమ వసూళ్లే లక్ష్యంగా డిపిఓ కార్యాలయంలో బుధవారం ఒక్కరోజే 29 మంది పంచాయతీ కార్యదర్శులకు డిప్యూటేషన్లు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈనెల మొదటి వారంలో కూడా ఆరుగురు పంచాయతీ కార్యదర్శులకు డిపిఓ డిప్యూటేషన్లు వేసినట్లు సమాచారం.

దరఖాస్తు చేసుకొని వారికి డిప్యూటేషన్లు..

పనిష్మెంట్ కింద కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులను దూరప్రాంతాలకు పోస్టింగ్ ఇవ్వడం వల్ల వారు విధులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందన్న సాకుతో డిప్యూటేషన్ల దందాకు తెరతీసిన అధికారులు డిప్యూటేషన్లు కావాలని దరఖాస్తు చేసుకోని కార్యదర్శులను కూడా దూర ప్రాంతాలకు బదిలీ చేయడం గమనార్హం.

అక్రమాలకు ఇవే సాక్షాలు


–త్రిపురారం మండలం రాజేంద్రనగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గా ఐదు సంవత్సరాల పాటు పనిచేసిన ఓ కార్యదర్శి గత ఆగస్టులో నిర్వహించిన సాధారణ బదిలీలలో చింతపల్లి మండలానికి బదిలీ అయింది. తనకున్న రాజకీయ పలుకుబడితో తిరిగి త్రిపురారం మండలం దుగ్గేపల్లి పంచాయతీ కార్యదర్శి గా డిప్యూటేషన్ పై వచ్చింది. అప్పలమ్మ గూడెం కార్యదర్శిగా వెళ్లి తిరిగి దుగ్గేపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరింది. 9 నెలల కాలంలోనే మూడు గ్రామాల కార్యదర్శిగా పనిచేసిన ఆమె తిరిగి తన రాజకీయ పలుకుబడితో ఐదేళ్లు పనిచేసిన రాజేంద్రనగర్ గ్రామానికి తిరిగి డిప్యూటేషన్ వేయించుకోవడం చూస్తుంటే డిప్యూటేషన్లలో ఎన్ని అక్రమాలు జరిగాయో ఇట్టే చెప్పొచ్చు.

–త్రిపురారం మండలం రాజేంద్రనగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి గత సంవత్సరం ఆగస్టులో జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా ఇక్కడికి వచ్చారు. వివాద రహితుడిగా పేరున్న సదరు పంచాయతీ కార్యదర్శి తనకు డిప్యూటేషన్ వేయాలని దరఖాస్తు చేసుకోకున్నా అధికారులు రాజకీయ పలుకుబడి ఉన్న గతంలో అక్కడే పని చేసిన పంచాయతీ కార్యదర్శినే రాజేంద్రనగర్ పంచాయతీ కార్యదర్శి గా డిప్యూటేషన్ వేశారు. ఇక్కడికి సాధారణ బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శిని నిడ్మనూర్ మండలం ఎం కె వి గూడెం కు డిప్యూటేషన్ వేశారు.

— త్రిపురారం మండలం కామారెడ్డి గూడెం పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి డిప్యూటేషన్ కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోకున్నా ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే అధికారులు తిరుమలగిరి సాగర్ మండలం గట్టుమీద తండాకు బదిలీ చేశారు. పలువురు పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తు చేసుకోకున్నా కొంతమంది కార్యదర్శులు తమకున్న రాజకీయ పలుకుబడితో తాము అనుకున్న చోటుకి డిప్యూటేషన్ వేయించుకున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆరోపణలపై స్పందించని అధికారి


ప్రస్తుత పంచాయతీ అధికారి పనితీరు వివాదాస్పదంగా మారిందని పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. డిపిఓ కార్యాలయ కేంద్రంగా మ్యూచువల్ బదిలీలు కావాలనుకున్నవారు కార్యాలయంలో సంప్రదించాలని ఓ పంచాయతీ కార్యదర్శుల సంఘం నేత వాట్సప్ గ్రూపులో పోస్టింగ్ పెట్టడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఇందులో తన పాత్ర ఏముందని ఎవరో కార్యదర్శి వాట్స్అప్ గ్రూప్ లో పోస్ట్ చేసుకున్న దానికి తనకు సంబంధం ఏంటని అప్పట్లో ఎదురు ప్రశ్నించిన డిపిఓ పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించకుండా తాను అనుకున్న పని పూర్తి చేశారు. డిపిఓ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా అక్రమంగా తిష్ట వేశారు. అని పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించి కలెక్టర్ వారిని కార్యాలయం నుండి వారు పనిచేస్తున్న పాత చోటికి పంపించగా డిపిఓ వెంకయ్య కొద్దిరోజుల్లోనే వారిని తిరిగి కార్యాలయంలోకి రప్పించుకున్నారు. ఈ విషయం తీవ్ర వివాదాస్పదం అవుతోంది.

–అక్రమ డిప్యూటేషన్ల పై విచారణ జరిపించాలి

ఓకే నెలలో 35 మంది పంచాయతీ కార్యదర్శులకు అక్రమ డిప్యూటేషన్లు వేసిన ఘటనపై కలెక్టర్ విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ కు తప్పుడు సమాచారం అందించి కింది స్థాయి అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. అయితే కలెక్టర్ అక్రమ డిప్యూటేషన్ లపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అన్యాయానికి గురైన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం జరిగే అవకాశం ఉంది.

ఫోన్ లిఫ్ట్ చేయని డిపిఓ

జిల్లా పంచాయతీ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న పంచాయతీ కార్యదర్శుల అక్రమ డిప్యూటేషన్ల పై వస్తున్న ఆరోపణలపై వివరణ కోరెందుకు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఫోన్ లో సంప్రదించగా ఒకసారి ఫోను అందుబాటులోకి రాలేదు. మరొకసారి ఫోన్ రింగ్ అయినా లిఫ్ట్ చేయలేదు.