–ప్రపంచ సుందరి పోటీదారులు బుద్ధవనాన్ని సందర్శించే అవకాశాలు
–అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం
–రాష్ట్ర పర్యటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి
–జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి సమీక్ష
Director Prakash Reddy : ప్రజాదీవెన నల్గొండ : ఈ సంవత్సరం మే నెల లో హైదరాబాదులో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు బుద్ధవనాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పర్యటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇందుకుగాను బుద్ధవనంలో అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం శనివారం ఆయన నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం లో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.
సమీక్ష అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మేలో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా పోటీలలో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన పోటీదారులు ధ్యానం నిమిత్తం బుద్ధ వనాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల ఇక్కడ ఏర్పాట్ల నిమిత్తం సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. వారు బుద్ధవనం తోపాటు,విజయ విహార్, నాగార్జునసాగర్ డ్యాం ను సందర్శించే అవకాశం ఉందని అన్నారు. వివిధ దేశాల నుండి వచ్చిన వారందరికీ బుద్దవనాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా,ధ్యాన కేంద్రంగా చూపించడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా బుద్ధవనం పేరు, ప్రతిష్టలు చాటి చెప్పే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొని ఇక్కడికి సందర్శనకు వచ్చే వారికి గద్వాల, పోచంపల్లి వంటి చీరల ప్రాముఖ్యత, తెలంగాణ టూరిజం, చేతివృత్తులు, కలంకారీలు, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎస్పీ, పర్యాటక శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖ ల అధికారులతో బుద్ధవనం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. మే 7 నుండి 31 వరకు హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయని, మే 12న బుద్ధపూర్ణిమ సందర్భంగా నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనం లో నిర్వహించే కార్యక్రమాలతో పాటు ధ్యానం లో పాల్గొనేందుకు ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొన్న వారు రానున్నట్లు తెలిపారు. సుమారు 140 దేశాల నుంచి 140 మంది ప్రపంచ సుందరి పోటీలలో పోటీదారులు పాల్గొంటున్నారని, ఆసియా ఖండం నుంచి సుమారు 30 మంది పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. మే 12 న బుద్ధపూర్ణిమ సందర్భంగా వీరు ధ్యానంలో పాల్గొనే నిమిత్తం 140 మంది లేదా ఆసియా ఖండానికి చెందిన 30 మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులతో కోరారు. మే 12 న వీరు హైదరాబాద్ నుండి బయలుదేరి విజయ విహార్ చేరుకొని బుద్ధవనాన్ని సందర్శిస్తారని, బుద్ధ వనంలో బుద్ధ చరితవనం సందర్శన తర్వాత బుద్ధ స్తూపాన్ని సందర్శించి అక్కడ ధ్యానం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని, కళాకారులతో స్వాగత కార్యక్రమం, డ్రోన్ షో వంటివి ఏర్పాటు చేయాలని, ఆరోజు అటవీ శాఖ ద్వారా బుద్ధ వనంలో మరింత పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు ఏర్పాటు చేయాలని చెప్పారు. బుద్ధ వనం సందర్శించే ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొన్న వారందరికీ అవసరమైన రాత్రి భోజనం, వసతి సౌకర్యాలు అన్నిటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, ఇందుకు సమగ్రంగా ప్రణాళిక రూపొందించాలని కోరారు. బుద్ధవనం మినీ కాన్ఫరెన్స్ హాల్లో జనరేటర్, ఏసీలు ఏర్పాటు చేయాలని, తెలంగాణ పర్యాటకాన్ని తెలిపే విధంగా వీడియో షో ఏర్పాటు చేయాలని, డ్రోన్ షో ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని ఇక్కడికి వచ్చే వారందరికీ అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ యంత్రాంగం తరఫున చేస్తామని, వారికి అవసరమైన వసతి, సౌకర్యాలు కల్పిస్తామని, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఇంచార్జ్ గా ఉంటారని తెలిపారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ బుద్ధ వనం సందర్శించే ప్రపంచ సుందరి పోటీదారులందరికి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని, ఆరోజు బుద్ధ వనం వచ్చే వారికి పాసులను జారీ చేయడంతో పాటు, పోలీస్ సెక్యూరిటీని, అంబులెన్స్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలు బుద్ధ చరిత వనం, బోటింగ్ పాయింట్, నాగార్జునసాగర్ డ్యాం, తదితరాలను సందర్శించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఏఎస్పి మౌనిక, బుద్ధ వనం ఓఎస్డి సుబాన్ రెడ్డి, పురావస్తు శాఖ కన్సల్టెంట్ శివ నాగిరెడ్డి , పర్యాటకశాఖ జనరల్ మేనేజర్లు సూర్యప్రకాష్, ఇబ్రహీం, పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులు, అటవీశాఖ అధికారి సంగీత ఇతర శాఖల అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.