–జిల్లాలలో ఆపద మిత్రుల ఏర్పాటు
–గ్రామాలలో అవగాహన కల్పించాలి
–మరొక సారి జిల్లాలో ప్రత్యేక సమావేశం
— జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్
Advisor Naval Prakash : ప్రజాదీవెన నల్గొండ : విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత అని జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్ అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ కింద ఏర్పాటైన ఆపదమిత్ర వాలంటీర్లు, జిల్లా అధికారులతో చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వరదలు, తుఫాన్లు, భూకంపాలు, ప్రమాదాలు తదితర విపత్తులు సంభవించినప్పుడు జాతీయ విపత్తు నిర్వహణ బృందం, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు అక్కడికి చేరుకునే లోపే సహాయకరంగా ఉండేందుకుగాను అన్ని జిల్లాలలో ఆపద మిత్రుల ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నల్గొండ జిల్లాలో ఆపద మిత్రుల నియామకం, శిక్షణ కార్యక్రమాలు,చేపట్టిన వివిధ రకాల అవగాహన కార్యక్రమాలపై డిఆర్డిఓ శేఖర్ రెడ్డి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ బృందానికి వివరించారు. అనంతరం నావల్ ప్రకాష్ మాట్లాడుతూ ఆపదమిత్రలు ప్రత్యేకంగా వారి గ్రామాల్లోనే కాకుండా దగ్గర్లోని గ్రామాల్లో సైతం విపత్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. మరోసారి జిల్లాలో ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా విపత్తుల నిర్వహణలో తనను తాను కాపాడుకుంటూనే ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలో నేర్చుకోవాలని, ఈ విషయాలను వాలంటీర్లు ప్రజలకు తెలియజేయాలని అన్నారు.
విపత్తుల నిర్వహణలో ఆయా ప్రభుత్వ శాఖల బాధ్యతలపై ఆయన మాట్లాడుతూ ప్రతి శాఖ విపత్తుల నిర్వహణకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని, నల్గొండ జిల్లాకు సంబంధించి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికను ఈ నెలాఖరు లోగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆమోదం పొందాలని సూచించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, అగ్నిమాపక, పోలీస్, తదితర శాఖలు వారి శాఖలకు సంబంధించి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారి వారి శాఖల భాగస్వాముల కు అవగాహన కల్పించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 750 జిల్లాలకు గాను, 700 జిల్లాలలో విపత్తు నిర్వహణ ప్రణాళికలు ఉన్నాయని, తక్కిన జిల్లాలు ఈనెలాఖరులోపు విపత్తు నిర్వహణ ప్రణాళికలు సమర్పించాల్సి ఉందని తెలిపారు. అంతేకాక విపత్తుల నిర్వహణకు సంబంధించి ఆపద మిత్రుల వివరాలన్నింటిని ఇండియన్ డిజాస్టర్ రిసోర్స్ నెట్వర్క్ పోర్టల్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని తెలిపారు.
నల్గొండ జిల్లా ప్రకృతి వైపరీత్యాల పరిధిలో లేనప్పటికీ ఒకవేళ విపత్తులు సంభవిస్తే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకించి విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలో వాటికి సంబంధించిన నియమాలను రూపొందించాలని చెప్పారు.ఆపద మిత్రులకు సంబంధించిన స్కిల్ మ్యాపింగ్ తయారు చేయాలని ,జిల్లా స్థాయిలో జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లా అత్యవసర ఆపరేషన్ కేంద్రాన్ని నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధికారి గౌతం మాట్లాడుతూ ప్రత్యేకించి విపత్తు నిర్వహణకై జిల్లా స్థాయిలో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, ఆపదమిత్ర కార్యకలాపాలను, విపత్తు నిర్వహణపై ఆయా శాఖల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్ లో అప్లోడ్ చేయాలని, రాష్ట్రస్థాయిలో విపత్తు నిర్వహణకు సంబంధించి ముఖ్యమైన జిల్లా అధికారులతో టెలిఫోన్ డైరెక్టరీని రూపొందిస్తున్నందున వివరాలను వెంటనే పంపించాలని, పాఠశాలలు, ఆసుపత్రుల భద్రతకు సంబంధించిన పాలసీలను ఆయా శాఖలు తప్పనిసరిగా అనుసరించాలని, త్వరలోనే నల్గొండ జిల్లాలో విపత్తుల నిర్వహణపై జిల్లా అధికారులకు ఒకరోజు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఆపదమిత్ర లు బాగా పనిచేస్తున్నారని, వారికి మూడు విడతలలో శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చామని,విపత్తుల సమయంలో ఆపద మిత్రల సహకారం ఎంతో గొప్పదని ,జిల్లాకు సంబంధించిన విపత్తు నిర్వహణ ప్రణాళికను రెండు, మూడు వారాల్లో సమర్పిస్తామని, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అండర్ సెక్రెటరీ అభిషేక్ బీస్వాల్, వసీం ఇక్బాల్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుదేశ్ కుమార్, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ఆపదమిత్ర వాలంటీర్లు, తదితరులు హాజరయ్యారు.