— అందరిలాగే బుక్స్ ఇవ్వాలి ఒకే గదిలో కూర్చోబెట్టాలి
–కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్
–నల్లగొండలో ఆల్ఫా స్కూల్ ముందు ధర్నా
BAS Students : ప్రజాదీవెన నల్గొండ : బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు ఆల్ఫా స్కూల్ యాజమాన్యం వివక్షతకు పాల్పడుతుంది. సరైన బుక్స్ ఇవ్వకుండా దళిత విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. శుక్రవారం పేరెంట్స్ తో కలిపి ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ముందు పేరెంట్స్, స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో దళిత విద్యార్థులకు ఉన్నత విద్య చదివించాలనే లక్ష్యం బూడిదలో పోసిన పన్నీరు లాగా మారుతుందని ఆవేదన చెందారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో దళిత విద్యార్థులకు బుక్స్ ఇవ్వకుండా అందరినీ ఒకే క్లాసులో కాకుండా దళిత విద్యార్థులను సపరేట్ గా కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు సరిగా వసతులు కల్పించకుండా నెల రోజులుగా తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురై విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆల్ఫా స్కూల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని వివరించారు.
ఆల్ఫా స్కూలు యజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ మీ ఇష్టం ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి అని దురుసు గా ప్రవర్తించారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, సోషల్ వెల్ఫేర్ డిడి కలగజేసుకొని సమగ్రంగా విచారణ జరిపి ఆల్ఫా స్కూల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తాము చెప్పిందే వినాలనే ధోరణి ప్రదర్శిస్తున్నాయని అన్నారు. కొద్ది రోజులుగా పెండింగ్ బిల్లులు ఉండొచ్చు కానీ బిల్లులు రాలేదనే నేపంతో ఫీజులు కట్టమని, పుస్తకాలు కొనుక్కోమని విద్యార్థులను స్కూలు నుండి బయటకు వెళ్లగొడుతున్న పరిస్థితులు ఉన్న కనీసం పట్టించుకునే నాధుడే లేడని తీవ్ర ఆవేదన చెందారు. ఇప్పటికైనా జిల్లాలో బిఎఎస్ స్కీమ్ కింద ఉన్న విద్యార్థులకు అందరికీ సమాన విద్యా అందించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఉద్యమ పోరాటాలు నిర్వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ఆల్ఫా స్కూల్ ముందు జరిగే ధర్నా లో టు టౌన్ ఎస్సై సైదులు వచ్చి మాట్లాడిన ఫలితం లేకుండా పోయింది. సోమవారం వరకు పేరెంట్స్ ఓపికతో ఉంటారని లేని పక్షంలో తమ విద్యార్థులను అందరినీ ఆ స్కూలు నుండి పంపితే ఇతర బిఎఎస్ స్కీం కింద స్కూళ్లలో జాయిన్ అవుతామని తెలిపారు. మా పిల్లల భవిష్యత్తు ఆగం అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారని పేరెంట్స్ వాపోయారు. డిడి సోషల్ వెల్ఫేర్ కు తెలియజేయుటకు ప్రయత్నించిన అందుబాటులోకి రాలేదని తెలిపారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులు తీసుకోవాలని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో
కెవిపిఎస్ పట్టణ కార్యదర్శి గాదె నరసింహ, మండల కార్యదర్శి బొల్లు రవీంద్ర కుమార్, పేరెంట్స్ బండారు శంకర్, కత్తుల శివ, టి. రవితేజ, రాజు, పేర్ల నరసింహ, కట్టా నవీన్, జి. శ్రవణ్, వెంకటేష్, నాగరాజు, ఎం. రజిత, మేడిపల్లి పల్లవి, అరుణ, మేడిపల్లి లక్ష్మీ, జానయ్య, తదితరులు పాల్గొన్నారు.
–నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాం…
బి. నరసింహ (కరస్పాండెంట్ ఆల్ఫా పబ్లిక్ స్కూల్ నల్గొండ )
మా పాఠశాలలో వివక్షత లేదు. అందరు విద్యార్థులు సమానమే. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను త్వరలోనే ఇస్తాం. బస్సు సౌకర్యాన్ని కల్పించలేము. అది నిబంధనలో లేదు. 90 లక్షల రూపాయలు బకాయి ఉండటం వల్ల ఎంతో ఇబ్బందిగా ఉంది. బకాయిలను విడుదల చేస్తే బాగుంటుంది