–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : పోషణ పక్షం 2025 అమలులో భాగంగా ఈనెల 11 న దేవరకొండలో నిర్వహించనున్న పోషణ పక్షం ప్రత్యేక కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పోషణ పక్షం 2025 పై బుధవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల్లో పోషణ లోపం లేకుండా ఉండేందుకు సరైన ఎదుగుదల ఉండేలా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అవగాహన కల్పించేందుకుగాను ప్రతి సంవత్సరం పోషణ అభియాన్ కింద పోషణ మాసోత్సవాలు, పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఈనెల 8 నుండి పోషణ పక్షోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమం అమలులో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 8న అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీల బరువును తీయడం, గర్భిణీ స్త్రీల సంరక్షణపై భర్తలతోపాటు, ప్రజలకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించడం, అలాగే రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ , అంగన్వాడీలు, ఆశ,, ఏఎన్ఎంలు ఇళ్లను సందర్శించడం ద్వారా తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం, అనుబంధ ఆహార పద్ధతులను, వ్యాధి నిరోధకత గురించి తెలియజేయడం, మొదటి వెయ్యి రోజుల్లో పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను, గర్భిణి స్త్రీలు, పాలిచ్చే తల్లులకు, సంరక్షకులతో కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించడం, పరిశుభ్రత పై అవగాహన, శిశువులకు ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించడంపై అవగాహన, రక్తహీనతపై కౌమార బాలికలు, గర్భిణీ స్త్రీలు, ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు రక్త హీనత నివారణకై రక్త పరీక్షల నిర్వహణ, అవగాహన, స్థానికంగా లభ్యమయ్యే ఆహార పదార్థాలు, చిరుధాన్యాల ఉపయోగం, వాటిపై కార్యక్రమాల ఏర్పాటు, పోషణ ట్రాకర్ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది.
ఇందుకు దేవరకొండ డివిజన్లో మహిళలు, బాలింతలు, గర్భిణి స్త్రీలు, చిన్నపిల్లలకు అవగాహన కల్పించేందుకుగాను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది.
ఈ కార్యక్రమానికి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లల తల్లులు, అలాగే వారి భర్తలు, తల్లిదండ్రులు అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పారు. ప్రత్యేకించి మిల్లెట్స్ పై అవగాహన కల్పించాలని అన్నారు. పిల్లల్లో ఒబిసిడి తగ్గించడం, పనిచేసే మహిళల్లో పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో చేర్చే విధంగా క్రష్ లు ఏర్పాటు చేయడం, బరువు తక్కువ ఉన్న పిల్లల బరువు, ఎదుగుదల, తీసుకోవాల్సిన పోషకాహారం, జాగ్రత్తలపై అవసరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చార్టులు, అవగాహన కల్పించే వక్తలను గుర్తించాలని ఆదేశించారు.
జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, ఆర్డీవోలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఏపీడి శారద, ఉపవైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా పార సరఫరాల ఇన్చార్జి అధికారి హరీష్, సిపిఓ తదితరులు ఈ సమస్య సమావేశానికి హాజరయ్యారు.