–కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi :ప్రజాదీవెన నల్గొండ :అన్ని గ్రామాలు, తండాలలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.బుధవారం ఆమె నల్గొండ జిల్లా, మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిడిఓ, సంబంధిత అధికారులతో తాగునీరు, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వేసవిలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడకూడదని, అందువల్ల గ్రామాలు, తండాలలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాగునీటి పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే సమస్యను పరిష్కరించాలని, మండల స్థాయిలో వీలుకాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మండలంలో ఉన్న గ్రామాలు, తండాలకు మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలని, గుర్తించిన పనులు చేపట్టేందుకు కూలీలకు అవగాహన కల్పించి ఎక్కువ మంది పనులకు హాజరయ్యేలా చూడాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అన్ని పనులు పూర్తిచేయాలని, నియోజకవర్గ అధికారుల నియామకం, అలాగే 200 ఇండ్లకు ఒక అధికారి నియామకం, జాబితా పరిశీలన, తదితర అంశాలపై సమీక్షించారు .
అంతకు ముందు జిల్లా కలెక్టర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి ఆస్పత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్లతో మాట్లాడారు. చండూరు ఆర్డీవో శ్రీదేవి, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడివో మునయ్య, తదితరులు ఉన్నారు.