–రైతులు పంట మార్పిడి దిశగా వెళ్లాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
— కంప సాగర్ లో ఫాక్స్ నట్ మఖాన ప్రయోగాత్మక సాగు ప్రారంభం
–60 శాతం పంట దిగుబడి వచ్చిన ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
–జిల్లా యంత్రాంగం తరఫున ఇకపై క్షేత్రస్థాయిలో సందర్శనలు
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ జిల్లాను వ్యవసాయ హబ్ గా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇక్కడి వాతావరణం, నీటి వసతులు, నూతన పంటల సాగు, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నల్గొండ ను వ్యవసాయ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.శనివారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా, త్రిపురారం మండలం, కంప సాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫాక్స్ నట్ మఖాన ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు. రైతులు బాగుపడేందుకు ఒకే పంట పై ఆధారపడకుండా పంట మార్పిడి దిశగా వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఒకే పంటను సాగు చేయడం వల్ల కరువు లేదా తెగులు వంటివి సోకినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతారని, అలా నష్టపోకుండా పంటల మార్పిడి పాటించినట్లయితే ఎక్కువ లాభాలు వచ్చేందుకు అవకాశం ఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ పంటలు కాకుండా కొత్తరకం పంటలు సాగు చేయాలన్న ఉద్దేశంతో జిల్లా నుండి 4 వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల బృందాన్ని గత మార్చిలో బీహార్ రాష్ట్రంలోని దర్భంగ మఖాన స్టేషన్ పంపించడం జరిగిందని, ఈ బృందం అక్కడ మఖాన సాగు గురించి విత్తనం మొదలుకొని పంట కోత వరకు అన్ని విషయాలను అధ్యయనం చేసి ఇక్కడి రైతులతో వారి అనుభవాలను పంచుకున్నారని తెలిపారు.
నల్గొండ జిల్లాలో మఖాన సాగులో భాగంగా ప్రయోగాత్మకంగా కంప సాగర్ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ముందుగా ఒక ఎకరం విస్తీర్ణంలో మఖాన సాగును చేసేందుకు నిర్ణయించడం జరిగిందని, ఇందుకు 10 కిలోల విత్తనం వాడడం జరుగుతున్నదని, రెండు, మూడు నెలల్లో ఈ విత్తనం ఒక ఎకరం క్షేత్రానికి తరలించనున్నట్లు తెలిపారు. పూర్తి సాంకేతికంగా పండించనున్న మఖాన సాగులో భాగంగా కంపసాగర్ వ్యవసాయ పరిశోధన క్షేత్రం తో పాటు, కట్టంగూర్ రైతు ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో 3 ఎకరాలలో, నకిరేకల్ నియోజకవర్గంలో 2 ఎకరాలు, కొండమల్లేపల్లి లో 4 ఎకరాలలో మఖాన సాగును చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అయితే చాలామందికి మఖాన సాగు బీహార్ లాంటి రాష్ట్రంలో మాత్రమే వాతావరణం అనుకూలంగా ఉంటుందని, నల్గొండ జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉంటుందా? లేదా? అనే అపోహలు ఉన్నాయని, వీటిన్నింటిని పక్కనపెట్టి నూతన పంటల సాగుపై చర్యలు తీసుకోవడంలో భాగంగా తాము తొలిమెట్టు ఎక్కినట్లుగా భావిస్తున్నామన్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ మఖాన పంటలో భాగంగా 60 శాతం పంట దిగుబడి వచ్చినా ఇక్కడే మఖాన ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. అలాగే కట్టంగూరు రైతు ఉత్పత్తి సంస్థ సహకారంతో మహిళా బజార్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. నల్గొండ జిల్లా సాధారణ పంటలతో పాటు, వివిధ రకాల కొత్త పంటలను సాగు చేసేందుకు ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, వాతావరణం తో పాటు, మరిన్ని నీటి పారుదల సౌకర్యాలు రానున్నాయని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నల్గొండను వ్యవసాయ హబ్ గా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునీకరణను రైతులు అనుసంధానం చేసుకొని నూతన వంటలు పండించేందుకు కొత్త వంగడాలను పండించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే వ్యవసాయంలో వస్తున్న నూతన పద్ధతులపై రైతులకి కంప సాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం తో పాటు, కొండమల్లపల్లిలో ఉన్న కెవికె క్షేత్రస్థాయి ప్రదర్శనలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాయని, జిల్లా యంత్రాంగం తరఫున ఇకపై క్షేత్రస్థాయిలో సందర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్గానిక్ వ్యవసాయంపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నందున ఆర్గానిక్ వ్యవసాయంపై అవకాశాలు, ముఖ్యంగా కూరగాయలు, బత్తాయి,నిమ్మ వంటివి పండించేందుకు తక్కువ ఎరువుల వినియోగం, ఎక్కువ దిగుబడులు సాధించేందుకు రైతులను క్షేత్రస్థాయి అధ్యాయానికి పంపిస్తామన్నారు. అలాగే కొండమల్లేపల్లిలో బత్తాయి, నిమ్మ శాస్త్రీయ పరంగా అధిక దిగుబడుల సాధనకు పరిశోధన చేస్తున్నారని, రైతులు వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంప సాగర్ లో ఉన్న వ్యవసాయ పరిశోధన క్షేత్రం దేశంలోఎక్కడా లేనివిధంగా లక్ష తొమ్మిది వేల క్వింటాల్ల నూతన విత్తన ఉత్పత్తిని చేపడుతున్నదని, ఎంతోమంది విద్యార్థులను చదివిస్తున్నదని అన్నారు.
రైతులు వరి పైనే కాకుండా ఆరుతడి, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని, ముఖ్యంగా వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఉదాహరణకు జామ పంటతో కిలో 300 రూపాయల వరకు ఆదాయం అర్జించే అవకాశం ఉందని, రైతులు పంటలకు సంబంధించి కొత్త ప్రయోగాలు చేయాలని, అయితే వారంతకు వారే ప్రయోగాలు చేయకుండా శాస్త్రీయ పద్ధతిలో చేయాలని, ఇందుకు కంప సాగర్, కొండమల్లేపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రాల సహకారం తీసుకోవాలని చెప్పారు. మిర్యాలగూడ ప్రాంతం కాలువల కింద సేద్యం చేస్తున్నారని, రెండో పంటకు కూడా ప్రభుత్వం నీరు ఇస్తున్నదని, అయితే వీటిని ఊరికే ఉపయోగించుకోకుండా వివిధ రకాల కొత్త పంటలను పండించేందుకు రైతులు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు .అయితే కొత్త పంటలు పండించడం వల్ల వచ్చే దిగుబడిని మార్కెట్ చేసుకునేందుకు రైతుల సందేహాల పరిష్కారంలో భాగంగా రైతు ఉత్పత్తిదారుల కేంద్రాలతో మాట్లాడి రైతు బజార్లు, ఆర్గానిక్ బజార్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ శాసనసభ్యులు, కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల కేంద్రం అధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం, మహిళల సాధికారత పట్ల మక్కువ చూపుతున్న జిల్లా కలెక్టర్ వ్యవసాయంలో కొత్త పద్ధతులు తేవడంతో పాటు, మఖాన సాగుకు బీహార్ ఉత్తరప్రదేశ్ కు జిల్లా శాస్త్రవేత్తలను పంపించి ఇక్కడ పండించేందుకు చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. కంప సాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రాథమికంగా మఖాన సాగును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు వరి పైన ఆధారపడకుండా, బహుళ పంటలు పండించాలని, మన ప్రాంతం తో పాటు, దేశంలో ఉన్న వివిధ రకాల పంటలను ఆహ్వానించాలని, కొత్త పంటలు, వంగడాలను పండించాలన్నారు. ముఖ్యంగా మఖానాకు సంబంధించి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, 250 గ్రాముల పాకెట్ 300 రూపాయలకు అమ్ముతున్నారని, ఈ మఖాన షుగర్ పేషెంట్లకు బాగా ఉపయోగపడుతుందని, ఆహారపు అలవాట్ల వల్ల షుగర్ ను తగ్గించుకోవచ్చని, ముఖ్యంగా మనం ఆచరించే పద్ధతులు, ఆహారపు అలవాట్ల వల్ల వయసును పెంచుకునే ఆస్కారం మనిషికీ ఉందని, కట్టంగూరు రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా 3 ఎకరాలలో మఖాన సాగుకు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రవణ్, ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి, కంప సాగర్ హార్టికల్చర్ హెడ్ లింగయ్య, వ్యవసాయ శాస్త్రవేత్తలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కంప సాగర్ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో పంటలను పరిశీలించారు .అంతేకాక మొక్కలు నాటి, మఖాన సాగు విత్తనాలను వ్యవసాయ క్షేత్రంలో చల్లారు.