— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
— వెలిమినేడు, పెద్ద కాపర్తి లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్
–ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రారంభం
District Collector Tripathi :ప్రజాదీవెన నల్గొండ : తేమ, తాలు లేకుండా నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, వెలిమినేడు, పెదకాపర్తి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అంతేకాక వెలిమినేడులో 22 లక్షల రూపాయల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొంత నిధులతో నిర్మించిన భవనాన్ని స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రబీ ధాన్యం కొనుగోలులో భాగంగా 384 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్ని కొనుగోలు కేంద్రాలలో తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు, టెంటు, కుర్చీలు వంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
నకిరేకల్ నియోజకవర్గంలో మొత్తం 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, 45 దొడ్డు ధాన్యం కేంద్రాలు, 5 సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం సాధారణ ధాన్యం రకానికి ప్రకటించిన మద్దతు ధర 2300 రూపాయలు, గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2,320 రూపాయలతో పాటు, సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ను పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు తాలు, తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని, రైతులకు రెండు, మూడు రోజుల్లో ధాన్యం అమ్మిన డబ్బులు వారి బ్యాంకు ఖాతాలలో జమ అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని, నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యానికి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువపత్రాలు ఇవ్వాలని అన్నారు. రైస్ మిల్లర్లు, రైతులకు తాలు, తేమ సమస్యలు రాకుండా ఆటోమేటిక్ ప్యాడి క్లీనింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని, అంతేకాక మాన్యువల్ ప్యాడీ క్లీనింగ్ మిషన్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.