–తిరిగి రాకుండా సమస్యలను పరిష్కరించాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా అధికారులు, ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన వయో వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆమె 74 మంది దివ్యాంగుల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. ఈ దరఖాస్తులలో గతంలో జారీచేసిన సదరం సర్టిఫికెట్లను ప్రీ అసెస్మెంట్ చేయించాలని, పెన్షన్లు మంజూరు చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోగా, వయోవృద్ధులు తమ పిల్లల నుండి పోషణ భత్యం ఇప్పించాలని, తల్లిదండ్రులను చూసే విధంగా ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వులు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రజావాని ద్వారా వచ్చిన దరఖాస్తులు తిరిగి రాకుండా సమస్యను పరిష్కరించాలని చెప్పారు. కొంతమంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, వారికి సమయం పడుతుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు.
దివ్యాంగులు తప్పనిసరిగా ప్రతినెలా పింఛన్ తీసుకోవాలని, 3 నెలలకు మించి పెన్షన్ తీసుకునేందుకు రాకపోతే పెన్షన్ ఆగిపోతుందని, పెన్షన్ పొందుతున్న వ్యక్తి జీవించి ఉన్నట్లు నిర్ధారణ అవసరమని, అందువల్ల తప్పనిసరిగా పెన్షన్ తీసుకోవాలని కోరారు. జిల్లా అధికారులు,ఆర్డీవోలు
దరఖాస్తు పై స్పెషల్ గ్రీవెన్స్ అని రాస్తే త్వరగా పరిష్కారం చేయాలని అన్నారు. ఆర్డీవోలు కిందిస్థాయిలో తహసిల్దార్ కు సైతం అలాంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, జిల్లా అధికారులు ఈ ప్రజావాణి కి హాజరయ్యారు.