–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సోమవారం సుమారు 100 మంది సమస్యల పరిష్కారం నిమిత్తం దరఖాస్తులు సమర్పించారు. ఈ దరఖాస్తులలో ఏప్పటిలాగే వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, పెన్షన్ మంజూరి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి దరఖాస్తులు అన్ని స్థాయిలలో జాప్యం లేకుండా పరిష్కరించాలని అన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కానట్లయితే స్పష్టంగా ఫిర్యాదు దారుకి తెలియజేయాలని చెప్పారు.
దర్తీ ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్…
పథకం కింద తిరుమలగిరి సాగర్ మండలం, రంగుండ్ల తండాలో మౌలిక వసతుల కల్పనకై గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా ఇదివరకే ఆదేశించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా రంగుండ్ల తాండలో జల్ జీవన్ కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 10 మీటర్ల లోతున వాన నీటి కట్టడాలను చేపట్టాలని, గ్రామంలో అన్ని ప్రభుత్వ సంస్థల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, 10 హెచ్ పి సోలార్ పంప్ ఏర్పాటు చేయాలని, పబ్లిక్ టాప్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ నిర్మాణం, లైబ్రరీ, స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఎంఎస్ఎం ఈ కింద ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని, చేపలు పట్టుకునేందుకు ఒక ఎకరం స్థలంలో డేమాన్స్ట్రేషన్ బ్లాక్ ఏర్పాటు చేయాలని, ఉద్యాన పంటల కింద సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ వంటివి ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగుండ్ల లో చేపట్టే పనులు ఇతర గిరిజన గ్రామాలలో చేపట్టే విధంగా మోడల్ గా నిలవాలని చెప్పారు. 52 గిరిజన గ్రామాలలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవకాశం ఉందని ఆమె తెలిపారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఇతర అధికారులు ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు.