–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధామ్య పథకాల అమలులో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమైన కార్యక్రమాల నిర్వహణలో మండల ప్రత్యేక అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. తాగునీటికి ఎక్కడ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి ఆర్డబ్ల్యూఎస్,మిషన్ భగీరథ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి ఇదివరకే నిర్దేశించినట్లుగా సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
దేవరకొండ డివిజన్లో పౌష్టికాహార ప్రాముఖ్యత పై మరోసారి సదస్సు నిర్వహించడం జరుగుతుందని, స్థానిక శాసనసభ్యులను ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. ఈనెల 8 నుండి 10 రోజులపాటు పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని, ఈ కార్యక్రమంలో భాగంగానే మహిళలు, గర్భిణీలు,పిల్లలు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం ఆరోగ్య జాగ్రత్తలపై గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు తెలియజేసే విధంగా మరోసారి అవగాహన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అంతేకాక టీఎస్ ఐ పాస్ కింద వచ్చిన దరఖాస్తులను ఆమోదించారు. అధనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,ఇంచార్జి డిఆర్ఓ వై.అశోక్ రెడ్డి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు. కాగా ఈ వారం ప్రజావాణి లో 92 మంది దరఖాస్తుదారులు వారి దరఖాస్తులను సమర్పించారు.