–ప్రమాదానికి గురైన ఆశ వర్కర్ ని పరామర్శించిన సిఐటియు నాయకులు
CITU leaders : ప్రజాదీవెన, నల్గొండ: ఆశా వర్కర్లను మంత్రులు,ఎమ్మెల్యేలు వస్తున్నారనీ ప్రభుత్వ కార్యకలాపాల పేరుతో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధంలేని సభలకు, సమావేశాలకు తీసుకువెళ్లడం ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండలో ఆటో ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన ఆశా వర్కర్ శ్రీదేవి ని నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు వస్తున్నారనే పేరుతో చుట్టుపక్క మండలాల ఆశా వర్కర్లను ఉదయం 10 గంటలకు నల్గొండకు పిలిచారని వారికి ఒక మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి రెండు గంటల వరకు అక్కడనే ఉంచడంతో అనేక మంది అసౌకర్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే కార్యక్రమానికి వచ్చిన కట్టంగూరు మండలం ఈదులూరు ఆశా వర్కర్, శ్రీదేవి ఆటోలో వస్తుండగా స్పృహ తప్పి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయని ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మీటింగులకు వెళ్ళమని పురమాయిస్తున్న మెడికల్ ఆఫీసర్లు ఎవరి ఆదేశాలతో ఇలాంటి సభలు సమావేశాలకు పంపుతున్నారని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లిన ఆశాలకు కనీసం టిఏ, డిఏ లు కూడా ఇవ్వడం లేదని వెళ్ళకపోతే తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇలానే ప్రభుత్వ కార్యకలాపాల పేరుతో ఆశలను అంగన్వాడీలను గ్రామపంచాయతీ కార్మికులను తరలించారని ఆయా సందర్భాలలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వారికి సంబంధం లేని సభలు సమావేశాలకు తీసుకెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ, నాయకురాలు చెరుకు జానకి, సిహెచ్. ధనలక్ష్మి, భూపతి రేణుక, శోభ, మంగమ్మ, పార్వతి రేణుక ,అనిత,రజిత తదితరులు పాల్గొన్నారు.