–టెక్నీషియన్లుగా మారిపోయిన స్టాఫ్ నర్సులు
–సరైన రిపోర్టులు అందక గుండె రోగుల ఇక్కట్లు
ECG Technician :ప్రజాదీవెన , నల్లగొండ జిల్లా :నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కాక పోతుండడంతో కీలకమైన విభాగాలలో ఒకరి బదులు మరొకరు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రోగులు అనేక ఇక్కట్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గుండె రోగులకు ఈసీజీ తీసే విభాగంలో టెక్నీషియన్ విధులకు హాజరు కాకపోవడంతో ఈసీజీ టెస్ట్ ల కోసం వచ్చిన రోగులకు స్టాఫ్ నర్స్ లే ఈసీజీలు తీయడం కనిపించింది. అత్యంత కీలకమైన ఈ విభాగంలో ముగ్గురు టెక్నీషియన్లు విధులు నిర్వహిస్తుండగా ఇందులో ఒకరిద్దరు ఉద్యోగులు కేవలం సంతకాలు పెట్టి విధులకు ఎగనామం పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఈసీజీ తీసుకునేందుకు పలువురు రోగులు రాగా ఈసీజీ గదిలో టెక్నీషియన్ విధులలో లేకపోవడంతో స్టాఫ్ నర్స్ లే రోగులకు ఈసీజీలు తీయడం కనిపించింది. సక్రమంగా విధులకు హాజరు కాకుండా వేతనాలు పొందుతున్న ఈసీజీ టెక్నీషియన్స్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు రోగులు కోరుతున్నారు. ఐతే ఇక్కడ పలువురు పురుషులకు కూడా స్టాఫ్ నర్స్ లే ఈసీజీ తీయడం విశేషం.
— మహిళా రోగులు వచ్చినప్పుడు స్టాఫ్ నర్స్ లే ఈసీజీ తీస్తారు
డాక్టర్ అరుణ కుమారి (ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇంచార్జ్ సూపరిండెంట్ నల్గొండ )
గుండె సంబంధిత సమస్యలతో వచ్చే మహిళా రోగులకు స్టాఫ్ నర్స్ లే ఈసీజీ తీస్తారని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ సూపర్డెంట్ అరుణకుమారి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు ఈసీజీ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారని వీరందరూ మగ వారేనని చెప్పారు. అందుకే మహిళా రోగులు వచ్చినప్పుడు స్టాఫ్ నర్స్ లే ఈసీజీ తీస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నీషియన్స్ సరిపోవడం లేదని త్వరలో మరో కొంతమంది ఈసీజీ టెక్నీషియన్లను నియమిస్తామని ఆమె తెలిపారు.