–సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ
Nationwide Strike : ప్రజాదీవెన నల్గొండ : ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర మోడీ విధానాలను తిప్పి కొట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదానికై ఎల్ఐసి1అండ్ 2 బ్రాంచ్ ఆఫీస్, కలెక్టరేట్ లోని సంక్షేమ భవన్ లో జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణచారి తో కలిసి కరపత్ర ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల రెక్కల కష్టంతో పెరిగి పెద్దవైన ఎల్ఐసి, బ్యాంకు లు, రైల్వే, పోస్టల్, విమానయానం, పోర్టులు తోపాటు దేశంలో ఉన్న సహజ వనరులైన భూములు గనులు మొత్తం జాతి సంపదను నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పేరుతో ప్రైవేటీకరించడం కోసం తహతలాడుతుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మూల స్తంభాలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తుల కారు చౌకగా ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక వర్గం వందేళ్ళ క్రితం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక వర్గ హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కొత్త చట్టాలు అమలులోకి వస్తే కార్మిక వర్గం ఏ హక్కులు లేని బానిసల్లాగా మారే ప్రమాదం ఉందని
ఈ విధానాలపై కార్మిక వర్గం కన్నెర్ర చేయాలని కోరారు. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక రైతాంగ ప్రజావ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సమ్మెలో ఉద్యోగులు కార్మికులు సంఘాలు జెండాలు ఎజెండాలు పక్కనపెట్టి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎల్ఐసి ఏఓఐ సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షులు నలపరాజు సైదులు, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ 1 అధ్యక్ష కార్యదర్శులు కొప్పు వెంకన్న, గడ్డం నవీన్ దాస్, బ్రాంచ్ 2 అధ్యక్ష కార్యదర్శులు పోలే లింగయ్య, వేముల శ్రీనివాస్ ఎల్ఐసి ఏవో ఐ బ్రాంచ్ 1 కార్యదర్శి సుంకి దేవేందర్ నాయకులు శివశంకర్ ధార వెంకన్న పృథ్వీరాజ్ రామలింగం తదితరులు పాల్గొన్నారు.