Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Employment Steering : కేంద్రం చేతిలోకి ఉపాధి స్టీరింగ్

— అమల్లోకి కొత్తగా ‘యుక్తధార’ యాప్

–దీని ద్వారా ఏ ప్రాంతంలో ఎప్పుడు పని చేయాలో నిర్దేశించనున్న కేంద్రం

–పథకాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ఎత్తుగడ

–రాష్ట్రాల హక్కులకు మంగళం పాడే దిశగా సంస్కరణలు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తోందా.. ఇప్పటి వరకూ రాష్ట్రాల అజమాయిషి లో ఉన్న ఈ పథకం నిర్వహణ పూర్తిగా కేంద్రం చేతికి వెళ్లనుందా.. ఇకపై పనుల కల్పన, అంచనాల ప్రక్రియను కేంద్రమే పర్యవేక్షించనుందా… ఇందులో భాగంగానే నూతన మొబైల్ యాప్ తీసుకొచ్చిందా.. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామమాత్రంగా మారనుందా… అంటే అవుననే సమాధానం వస్తోంది.

Employment Steering :ప్రజాదీవెన , నల్గొండ : గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు 100 రోజుల ఉపాధికి గ్యారెంటీ కల్పించాలని, ఉన్న ఊళ్లోనే పనులు కల్పించాలనే డిమాండుతో దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. అనంతరం, అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నాంది పలికింది. దీనిపై 2005లో చట్టం రూపొందించింది. ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా పనులు కల్పించేలా చేసింది. ఏపీఓ, ఎంపీడీఓలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. పనుల కల్పన నుంచి, బిల్లుల చెల్లింపుల వరకూ అన్నీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే నడిచేలా చర్యలు తీసుకుంది. ఏదైనా గ్రామంలో కూలీలకు పనులు కల్పించాలంటే ఆయా గ్రామ పంచాయతీలు సామూహికంగా ఒక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులను గుర్తించే వెసులుబాటు కల్పించారు. దీనినే సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ అంటారు. దీనిని గ్రామ కార్యదర్శి నిర్వహించాలి. ఉపాధి హామీ చట్టం-2005 ప్రకారం గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ తీర్మానాల అనంతరం మంజూరు చేయాలి. ఇప్పటి వరకూ ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాప్ తో ఇవన్నీ కనుమరుగుకానున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

యాప్ తో ఏం చేస్తారంటే..

ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి
తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘యుక్తధార’ పేరిట సరికొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనులను తన ఆజమాయిషీలో నిర్వహించేందుకు కేంద్రం సర్వం సిద్ధం చేసింది. ఏ రాష్ట్రంలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి. ఏ ప్రాంతంలో ఏ పని ఎప్పుడు పెట్టాలి.. అంచనాలు ఎలా వేయాలి.. బిల్లులు చెల్లింపులు ఎలా జరగాలనే అంశాలన్నింటినీ ఈ యాప్ ద్వారా ఢిల్లీలో కూర్చునే కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించే అవకాశం కలుగుతుంది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి అవసరమైన లేబర్ బడ్జెట్ కు ఆమోదం తెలుపుతుంది. కూలీలు చేయాల్సిన పనులన్నీ కేంద్రమే గుర్తిస్తుంది. పనులు చేపట్టిన కూలీలకు కేంద్రమే నేరుగా బిల్లులు చెల్లిస్తుంది. యుక్తధార మొబైల్ యాప్ వినియోగం నల్గొండ జిల్లాలోని 33 మండలాలలో మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి దశలో జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేయనున్నారు. అనంతరం, రెండో దశలో జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ దీనిని అమల్లోకి తెస్తారు.

రాష్ట్రాల హక్కులకు భంగం..

యుక్తధార యాప్ వలన రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి పథకం నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో
వివిధ రకాల పనులు చేపడుతున్నారు. ఈ యాప్ ద్వారా కేంద్ర పర్యవేక్షణ మొదలైతే భవిష్యత్తులో అన్ని రకాల పనులన్నీ చేసే వీలుంటుందా..? ఈ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు ఎవరి పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాలి.? రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, అవినీతి నిర్మూలనకే ఈ యాప్ తెచ్చామని కేంద్రం చెబుతోంది. అవినీతి నిర్మూలించాలంటే కఠిన నిబంధనలు తీసుకురావాలే తప్ప.. కేంద్రం ఆధీనంలోకి తీసుకోవడమేంటనే వాదన కూడా వినిపిస్తోంది. దీని వలన పనుల కల్పన తగ్గే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్ వలన ఉపాధి హామీ పథకంపై రాష్ట్రాలు తమ హక్కులను కోల్పోతాయని, ఇది పూర్తిగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నల్లగొండ జిల్లాలో జాబ్ కార్డులు..

నల్లగొండ జిల్లాలో పాత మండలాల ప్రకారం 31 మండలాలు 848 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 60 వేల జాబ్ కార్డ్ లు ఉండగా అందులో యాక్టివ్ జాబ్ కార్డ్ లు 2. 20 లక్షలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం కూలీల సంఖ్య 7.66 లక్షలు ఉండగా అందులో పని చేసే కూలీల సంఖ్య 3.79 లక్షల మంది ఉన్నారు. కూలి సగటు వేతనం 266.86 రూపాయలు కాగా 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి వెచ్చిస్తున్న నిధులు సుమారు 87 కోట్ల రూపాయలు.

నెల తర్వాత ప్రారంభం..

పైలెట్ ప్రాజెక్టు కింద గుర్తించిన నల్లగొండ జిల్లాలోని 31 మండలాలలోని 31 గ్రామ పంచాయతీలలో యుక్త దార మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లాలోని ప్రతి మండలం నుండి టెక్నికల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ)కి సిఆర్డి లో శిక్షణ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ శిక్షణ మరో నెల రోజులు కొనసాగే అవకాశం ఉంది. శిక్షణానంతరం 31 మండలాలలోని ఒక గ్రామ పంచాయతీలో యుక్త దార అమల్లోకి రానుంది.

పైలెట్ గ్రామ పంచాయతీలు ఇవే..

అడవిదేవులపల్లి మండలంలోని కొత్త నదికొండ గ్రామపంచాయతీ, అనుముల మండలం శ్రీనాధపురం, చందంపేట మండలం తెల్ దేవర్లపల్లి సెంటర్, చండూరు మండలం చామలపల్లి, చింతపల్లి మండలం చాకలి షేర్పల్లి, చిట్యాల మండలం గుండ్రంపల్లి, దామలచర్ల మండలం బంధవత్ తండా, దేవరకొండ మండలం షేర్పల్లి, గుండ్లపల్లి మండలం సింగరాజు పల్లి, గుర్రపోడు మండలం జునూతల, కనగల్ మండలం పొనుగోడు, కట్టంగూరు మండలం ఈదులూరు, కేతేపల్లి మండలం కొండకింది గూడెం, కొండమల్లేపల్లి మండలం కేశ్య తండా, మాడుగుల పల్లి మండలం గుర్రప్పగూడెం, మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి, మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్, మునుగోడు మండలం కొరటికల్, నకిరేకల్ మండలం చందుపట్ల, నల్లగొండ మండలం తొరకల్, నాంపల్లి మండలం ఫకీర్ పూర్, నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లముల, నేరేడుకొమ్ము మండలం పెద్దమునిగల్, నిడమనూరు మండలం ఊట్కూరు, పీఏ పల్లి మండలం గుండ్లపల్లి, పెద్దవూర మండలం చింతపల్లి, శాలిగౌరారం మండలం వెళ్లాలా, తిప్పర్తి మండలం సిరామియా గూడెం, త్రిపురారం మండలం బాబాసాయిపేట, తిరుమలగిరి సాగర్ లో తిరుమలగిరి, వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పంచాయతీలలో యుక్తధార అమలు కానుంది.