– పార్కింగ్ చేసే కార్లలో పిల్లలు ఎక్కకుండా చూడాలి.
– ఆదమరిస్తే అంతే., చిన్నారులు జరభద్రం
Children’s Safety :ప్రజాదీవెన, సూర్యాపట : వేసవి కాలంలో పార్క్ చేసిన వాహనాల్లోకి అనుకోకుండా వెళ్ళిన పిల్లలు తీవ్రమైన వేడిమి వల్ల ఊపిరాడక మృతి చెందుతున్న సంఘటనలు చాలా చోట్ల ఇటీవల నమోదైనాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు ప్రకటనలో తెలిపినారు. జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా విలువైన చిన్నారుల ప్రాణాలను రక్షించగలం అని ఎస్పి గారు అన్నారు.
కొన్ని సూచనలు:
– వాహనాన్ని లాక్ చేయకముందు వాహనంలో ఎవరైనా ఉన్నారా అని పూర్తిగా తనిఖీ చేసుకోవాలి. ముందు, వెనుక సీట్లను గమనించి పరిశీలించుకోవాలి.
– పార్క్ చేసే వాహనంలో లేదా వాహనం చుట్టుపక్కల పిల్లలను ఒంటరిగా వదిలివెళ్ళకూడదు.
– వాహన తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. అనుకోకుండా వాహనంలోకి వెళ్లి చిక్కుకుపోయే ప్రమాదం గమనించగలరు.
– వాహనాలు ఆడుకునే ప్రదేశాలు కాదని పిల్లలకు స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజేయాలి.
– వాహనాల్లో ఒంటరిగా ప్రవేశించరాదని వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి.
– “రియర్ సీట్ రిమైండర్”, “చైల్డ్ డిటెక్షన్ అలర్ట్” వంటి భద్రతా పరికరాలను వాహనాల్లో అమర్చండి.
– వాహనాల విండోలకు బ్లాక్ ఫిల్ములు లేదా అధిక టింటింగ్ ఉపయోగించరాదు—వాహనంలో ఎవరైనా ఉంటే గుర్తించలేని ప్రమాదం ఉంది.
– వాహనం వాడకంలో లేకపోయినప్పటికీ డోర్లు, విండోలను పూర్తిగా మూసి లాక్ చేయాలి.
– పిల్లలు కనిపించకుండా పోతే, వాహనాల్లో, సమీప వాహనాల్లో పరిశీలించాలి.