Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ex MP Vinod Kumar : “మాజీ ఎంపీ వినోద్ కీలక వ్యాఖ్యలు*

Ex MP Vinod Kumar : ప్రజా దీవెన ,హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణను మరోసారి విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇండియన్ ఐఐఎం, ట్రిపుల్ ఐటీ సంస్థలను కేటయించాలని ఎప్పటినుంచో అడుగుతున్నా.. ఈ బడ్జెట్‌లో కూడా కేటాయించలేదన్నారు. జిల్లాకో నవోదయ విద్యాలయం కేటయించాలన్న మా వినతిని పెడచెవినపెట్టారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి.. తెలంగాణ ఈ బడ్జెట్‌లో కూడా సైనిక్ స్కూల్‌కు నోచుకోలేదన్నారు.తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి దక్కిందేమీ లేదన్నారు.

 

ప్రాంతీయ పార్టీల నుంచి ఎంపీలు ఉంటేనే రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని, ఈ వాస్తవాన్ని తెలంగాణ గ్రహించాలని పిలుపునిచ్చారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు లోక్‌సభలో గళమెత్తాలి.. రాజ్యసభలో మా సభ్యులు తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాలపై ఉద్యమిస్తామిస్తామని చెప్పారు.త్వరలో ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రానికి వరాలు ప్రకటించారని ఆరోపించారు. ఎన్నికలుంటేనే రాష్ట్రాలను పట్టించుకుంటామన్న వైఖరి సరికాదని, మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటారు.. కానీ రాష్ట్రాలను ఒకేలా చూడడం లేదని ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలకు ఇన్‌కమ్ టాక్స్‌లో ఊరటనివ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయానికి గతంతో పోలిస్తే కొంత తోడ్పాటు లభించిందని, అయినా ఇది సరిపోదన్నారు. పదేళ్లుగా మోడీ పేద, మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, కొంతమంది దగ్గరే సంపద కేంద్రీకృతమైన ధోరణి పెరుగుతోందని వెల్లడించారు.