–నల్గొండ జిల్లా లో పెరిగిన ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానాలు
— త్వరలోనే గ్రామాలలో మోగనున్న ఎన్నికల సమరభేరి
Local Election : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారు చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి అనుగుణంగా నల్లగొండ జిల్లా లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలలో మార్పులు జరిగాయి.నల్గొండ జిల్లాలో రెండు మండలాలు కొత్తగా ఏర్పాటు కావడంతో మండలాల సంఖ్య 33కు చేరుకుంది. దీంతో మొత్తం 33 జడ్పీటీసీ స్థానాలు, 33 మండల అధ్యక్ష పదవులు ఉంటాయి. వీటికి ఎన్నికలు జరుగుతాయి. గత ఎన్నికల సమయంలో 2019 లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 31 మండలాలు మాత్రమే ఉన్నాయి. నల్గొండ జిల్లాలో కొత్తగా 2 మండలాలు ఏర్పడ్డాయి.
నల్గొండ జిల్లాలో గత ఎన్నికల్లో 349 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుత జాబితా ప్రకారం ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆ సంఖ్య 353 కు చేరుకుంది. అదేవిధంగా ఎంపీపీ, జడ్పిటిసి స్థానాల సంఖ్య కూడా గతంలో 31 ఉండగా ఈసారి ఆ సంఖ్య పెరిగి 33 కి చేరుకుంది.కాగా మండలాల పరిధిలో ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ స్థానాల పధిలో ఆ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.
—అధికారులకు ఆదేశాలు..
స్థానిక సంస్థల స్థానాలు ఖరారు కావడంతో ఇక గ్రామాల్లో ఎన్నికల నగరా మోగనుంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు కావాల్సిన సామాగ్రిని అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ, ఇంకా సంబంధిత అధికారులకు ఆదేశాలు అందాయి.