Gopal Reddy : ప్రజా దీవెన, కోదాడ: గత పది సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వరంగల్ ఖమ్మం నల్లగొండ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుడిగా తాను పదవి విరమణ చేసిన నాటి నుంచి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పని చేశానని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల రాకతో చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలు దివాలా తీశాయని ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు.
విద్యా వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కృషి చేయడంతో పాటు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆదరించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ అమలకు కృషి చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న బిల్లులు, ఖాళీగా ఉన్న పోస్టులు, ప్రమోషన్లు వంటి విద్యారంగ సమస్యలు అన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో సూరం ప్రభాకర్ రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు స్వామి, పందిరి నాగిరెడ్డి, చిన్ని, గంగాధర్, నరేష్, ఎస్ఎస్ రావు, ప్రసాద్, విజయ భాస్కర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.