Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gopinath Kattekola: సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఆర్టిఐ కమిషనర్ లను నియమించాలి

— తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ఏకగ్రీవంగా ఎన్నిక

Gopinath Kattekola: ప్రజాదీవెన,హైదరాబాద్: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ను నియమిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం సాధన కమిటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పకడ్బందీగా అమలు చేయాలని, ఆర్‌టిఐ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజలుకోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు ఇవ్వాలని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు, ప్రాణహాని ఉన్నప్పుడు కేవలం 48 గంటలలో సమాచారం అధికారులు ఇవ్వాలని అన్నారు.సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అని ప్రజలతోపాటు అధికారులు కూడా ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ పంచాయతి నుండి మొదలుకొని పార్లమెంటు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకొని 30 రోజుల్లో సమాచారం తీసుకోవచ్చని అన్నారు.

ఈ చట్టాన్ని ప్రజా ప్రయోజనాల నిమిత్తం సద్వినియోగం చేసుకోవాలని దుర్వినియోగం చేయకూడదని అవసరమైన సమాచారం మేరకే ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గోపీనాథ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం గ్రామ పంచాయతీలు మొదలుకొని పార్లమెంటు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి పౌరుడు దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వెన్నెముక అయిన సమాచార హక్కు చట్టం 2005 కు సంబందించిన 4 (1) బి సంబంధించిన 17 అంశాల సమాచారం, రిజిస్టర్‌ 1, రిజిస్టర్‌ 2 న గల కాపీలను ఉచితంగా, స్వచ్చందంగా ప్రజలకు కోరినప్పుడు అధికారులు ఇవ్వాలని అన్నారు.మూడో వ్యక్తి సమాచారం విషయంలో ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే సమాచారం అయితే సెక్షన్‌ 11 (1) ప్రకారంగా దరఖాస్తుదారునికి అధికారులు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇవ్వని అధికారులకు కనిష్టంగా 250 నుండి గరిష్టంగా 25 వేల వరకు జరిమానాలు సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్‌ విధిస్తారు అని అన్నారు.

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సిబిఐ, సిఐడి, కోర్టు జడ్జిమెంట్‌, దేశ భద్రత సమాచారం, పోలీస్‌ స్టేషన్‌ భద్రత, ఆయుధాల సమాచారాన్ని మినహాయించబడిందన్నారు. ప్రతి ఒక్కరు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని బయటకు తీయాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తుల మహేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి దీపక్ కులకర్ణి,పందుల రాజు గౌడ్, కె.రామయ్య తదితరులు పాల్గొన్నారు.